సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా దినేశ్ కార్తీక్ సరైనోడు: మాథ్యూ హేడెన్
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:20 PM
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఈ జట్టు ప్రధాన కోచ్ పదవికి సంబంధించి క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో..
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఒకటి. ఈ జట్టు ప్రధాన కోచ్ పదవికి సంబంధించి క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. దాదాపు 18 ఏళ్ల పాటు సీఎస్‌కే హెడ్ కోచ్‌గా సేవలు అందించి, జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన వారసుడిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సీఎస్కే హెడ్ కోచ్‌గా ఇయాన్ మోర్గాన్, మైఖేల్ హస్సీ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, సీఎస్కే మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఒక ఆసక్తికర పేరును తెరపైకి తెచ్చాడు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు మెంటర్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) పేరును హేడెన్ ప్రస్తావించాడు. అతడైతేనే చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ పదవికి సరిగ్గా సరిపోతాడని హేడెన్ అభిప్రాయపడ్డాడు.
దినేశ్ కార్తీక్‌కు చెన్నైతో ఉన్న స్థానిక అనుబంధమే ఇందుకు ప్రధాన కారణమని హేడెన్ పేర్కొన్నాడు. చెన్నైలో జన్మించిన దినేశ్ కార్తిక్.. దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడు తరఫున ఆడాడు. దీంతో అతడికి ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని ఈ ఆసీస్ మాజీ స్టార్ తెలిపాడు. చాలా ఫ్రాంచైజీలు ఇతర దేశాలకు చెందిన కోచ్‌ల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, చెన్నై లాంటి పెద్ద జట్టుకు 'స్థానిక టచ్' (Chennai touch) ఉన్న వ్యక్తే కోచ్ ఉండటం ఎంతో ముఖ్యమని హేడెన్ అభిప్రాయపడ్డాడు. మరి రాబోయే ఐపీఎల్ సీజన్ల కోసం సీఎస్కే యాజమాన్యం మాథ్యూ హేడెన్ సూచనను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. వీడియో వైరల్
డ్రగ్స్ రవాణా కేసులో మాజీ ఎయిర్ హోస్టెస్ అరెస్ట్..