డ్రగ్స్ రవాణా కేసులో మాజీ ఎయిర్ హోస్టెస్ అరెస్ట్..
ABN , Publish Date - Aug 25 , 2026 | 11:01 AM
డ్రగ్స్ రవాణా కేసులో మాజీ ఎయిర్ హోస్టెస్ అరెస్టు కావడం ప్రకంపనలు రేపుతోంది. వడోదర నుంచి ముంబైకి కారులో మత్తుపదార్థాలను తరలిస్తూ ఆమె పట్టుబడింది. రూ.30 లక్షల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్‌ను సరఫరా చేస్తూ అడ్డంగా బుక్కైంది.
న్యూఢిల్లీ: డ్రగ్స్ రవాణా కేసులో మాజీ ఎయిర్ హోస్టెస్ అరెస్టు కావడం ప్రకంపనలు రేపుతోంది. వడోదర నుంచి ముంబైకి కారులో మత్తుపదార్థాలను తరలిస్తూ ఆమె పట్టుబడింది. రూ.30 లక్షల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్‌ను సరఫరా చేస్తూ అడ్డంగా బుక్కైంది. పక్కా సమాచారంతో సూరత్ పోలీసులు మాజీ ఎయిర్ హోస్టెస్‌ను, ఆమె సహాయకుడిని అదుపులోకి తీసుకోగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులను ముంబైలోని శాంతాక్రూజ్‌కు చెందిన మాన్సీ సయ్యద్ (41), సోహైల్ సులేమాన్ షేక్ (20)గా పోలీసులు గుర్తించారు.
ముంబైలోని శాంతాక్రూజ్‌కు చెందిన మాన్సీ సయ్యద్ ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది. ఉద్యోగం మానేసిన తర్వాత ఆమె డ్రగ్స్ దందాలోకి దిగింది. తాజాగా ఆమె వడోదర నుంచి ముంబైకి భారీగా మెఫెడ్రోన్ డ్రగ్‌ను తరలిస్తున్నట్లు సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సోమవారం ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై పోలీసులు మాటు వేశారు. ఓ టోల్ ప్లాజా సమీపంలో మాన్సీ కారును గుర్తించి ఆపివేశారు. తనిఖీలు చేయగా రూ.30 లక్షల విలువైన 977 గ్రాముల మెఫెడ్రోన్ డ్రగ్ బయటపడింది. నిందితుల నుంచి మత్తుపదార్థాలతో పాటు మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ ప్యాకింగ్‌కు ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు, కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మాన్సీ, సోహైల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మాన్సీ సయ్యద్ గతంలో మలేషియన్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసినట్లు సూరత్ పోలీసులు తెలిపారు. ఉద్యోగరీత్యా ఆమె పలు దేశాలకు ప్రయాణించినట్లు వెల్లడించారు. 2015 నుంచే డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌తో మాన్సీకి సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. 2021లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సుమారు 100 గ్రాముల డ్రగ్స్‌తో ఆమె పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఆ కేసులో దాదాపు నాలుగేళ్లు జైలులో గడిపినట్లు వెల్లడించారు. అప్పటి దర్యాప్తులో మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆమెకు డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌తో ఉన్న సంబంధాలు బయటపడినట్లు అధికారులు చెప్పారు. కాగా, మాన్సీ గత డ్రగ్స్ కేసు, తాజా నెట్‌వర్క్ లింకులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్.. వీసా ఫీజు పెంచుతూ ప్రతిపాదనలు..
ఎస్ఐని చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే కుమార్తె.. వీడియో వైరల్..