Share News

ట్రంప్‌ ప్రభుత్వం భారీ షాక్‌.. వీసా ఫీజు పెంచుతూ ప్రతిపాదనలు..

ABN , Publish Date - Aug 25 , 2026 | 09:58 AM

అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్‌ ప్రభుత్వం మరోసారి భారీ షాక్‌ ఇచ్చింది. కొత్తగా జారీ చేసే H-1B వీసాలపై 1,03,265 డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను సోమవారం ప్రకటించింది.

ట్రంప్‌ ప్రభుత్వం భారీ షాక్‌.. వీసా ఫీజు పెంచుతూ ప్రతిపాదనలు..
America H-1B Visa Fee

వాషింగ్టన్‌: అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్‌ ప్రభుత్వం మరోసారి భారీ షాక్‌ ఇచ్చింది. కొత్తగా జారీ చేసే H-1B వీసాలపై 1,03,265 డాలర్ల (సుమారు రూ.86 లక్షలు) ఫీజు విధించే ప్రతిపాదనను సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయం ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. H-1B వీసాదారుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై ఆసక్తి నెలకొంది.


కొత్త H-1B వీసాలకు 1,03,265 డాలర్ల ఫీజు విధించాలని అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. తాజా ప్రతిపాదనపై 30 రోజులపాటు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. అనంతరం నిబంధనను ఖరారు చేసే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరి నాటికి కొత్త ఫీజు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గతేడాది అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ లక్ష డాలర్ల ఫీజును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆ నిర్ణయాన్ని ఫెడరల్‌ కోర్టు అడ్డుకోవడంతో ప్రస్తుతం న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది.


భారతీయులపైనే ఎక్కువ ప్రభావం..

అమెరికా కంపెనీలు టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, విద్య, పరిశోధన వంటి ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లోకి విదేశీ నిపుణులను తీసుకునేందుకు H-1B వీసాలను ఉపయోగిస్తాయి. ఏటా 65 వేల సాధారణ H-1B వీసాలు, అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి మరో 20 వేల వీసాలు అందుబాటులో ఉంటాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన H-1B వీసాల్లో దాదాపు 70 శాతం భారతీయులకే దక్కాయి. చైనా నిపుణులు 12 శాతంతో తర్వాతి స్థానంలో ఉన్నారు. దీంతో కొత్త ఫీజు భారతీయ నిపుణులపై భారీ ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఇప్పటికే విద్యార్థి వీసాపై ఉన్న విదేశీయులు H-1Bకు మారే సందర్భాల్లో, అలాగే ఇప్పటికే ఉన్న H-1B వీసాల పునరుద్ధరణకు 1,03,265 డాలర్ల ఫీజు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.


ట్రంప్‌ ప్రభుత్వం వాదన..

H-1B కార్యక్రమాన్ని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నాయని పేర్కొంటోంది. భారీ ఫీజు నేపథ్యంలో అమెరికన్‌ ఉద్యోగులను నియమించుకోవడం కంపెనీలకు మరింత ఆకర్షణీయంగా మారుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, వ్యాపార సంస్థలు మాత్రం ఈ వాదనను వ్యతిరేకిస్తున్నాయి. అమెరికాలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతను తీర్చడంలో H-1B కార్యక్రమం కీలకపాత్ర పోషిస్తోందని చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

హెచ్‌1బీలపై అమెరికా నిఘా నేత్రం!

విద్యార్థులపై పాక్ ఆర్మీ అధికారి దౌర్జన్యం.. ఏకంగా తుపాకీతో కాల్పులు..

Updated Date - Aug 25 , 2026 | 10:41 AM