Share News

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..

ABN , Publish Date - Aug 25 , 2026 | 11:40 AM

వచ్చే నెల న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే, దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్‌లో జిన్‌పింగ్ పర్యటించినట్లు అవుతుంది.

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..
Xi Jinping India visit

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే నెల న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే, దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్‌లో జిన్‌పింగ్ పర్యటించినట్లు అవుతుంది. 2020లో గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది (Xi Jinping India visit).


జిన్‌పింగ్ వెంట సుమారు 400 మంది అధికారులు, ప్రతినిధులతో కూడిన భారీ బృందం భారత్‌కు వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. 2019లో జిన్‌పింగ్ భారత్‌కు వచ్చినప్పుడు ఆయన వెంట వచ్చిన బృందంలో 200 మందికి లోపే ఉన్నారు. ఈసారి దాదాపు రెట్టింపు సంఖ్యలో ప్రతినిధులు వచ్చే అవకాశం ఉంది. చైనా అధికారులు ఇప్పటికే న్యూఢిల్లీలో హోటల్ ఏర్పాట్లు, భద్రతా ప్రోటోకాల్స్ ఖరారు చేసే పనిని ప్రారంభించినట్టు సమాచారం (Xi Jinping BRICS Summit 2026).


భారత్ ఈ ఏడాది బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది (India China relations). సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో సదస్సు జరగనుంది. జిన్‌పింగ్ హాజరు ఖరారైతే.. బ్రిక్స్ అంశాల కంటే భారత్-చైనా సంబంధాల్లో వచ్చిన మార్పుపైనే అంతర్జాతీయ దృష్టి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే జిన్‌పింగ్ పర్యటనను చైనా అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. బ్రిక్స్ సహకారానికి తాము ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని, ఈ ఏడాది సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు భారత్‌కు మద్దతు ఇస్తామని మాత్రమే చైనా విదేశాంగ శాఖ తెలిపింది. జిన్‌పింగ్ పర్యటనపై ప్రస్తుతం తమ వద్ద సమాచారం లేదని పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

కర్ణాటకలో అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌పై చర్యలు.. ఉమ్మెత్త విక్రయాలపై సీరియస్


మరింత పైకి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 25 , 2026 | 11:56 AM