Share News

బౌలర్‌గానూ ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ.. వీడియో!

ABN , Publish Date - Aug 25 , 2026 | 01:36 PM

టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ బంతితోనూ ఇరగదీశాడు. దులీప్ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌లో భాగంగా నార్త్‌ ఈస్ట్‌ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం నాలుగు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టాడు.

బౌలర్‌గానూ ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ.. వీడియో!
Vaibhav Suryavanshi bowling

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన బ్యాటింగ్‌తో స్టార్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అంతేకాక కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. ఇక బ్యాటింగ్ సంచలనంగా మారిన వైభవ్.. బౌలర్‌గా కూడా ఆకట్టుకున్నాడు. దేశవాళీ టోర్నీ దులీప్ టోఫ్రీ 2026లో వైభవ్ బౌలర్ అవతారం ఎత్తాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...


దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో వైభవ్ ఈస్ట్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్‌లో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌గా మారాడు. కేవలం నాలుగు బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లు పడగొట్టి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వికెట్ల ఖాతాను తెరిచాడు. నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 26వ ఓవర్ వద్ద ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్.. వైభవ్ సూర్యవంశీకి బంతిని అందించాడు. తన తొలి ఓవర్‌లో రెండు పరుగులు ఇచ్చిన వైభవ్.. ఆ తర్వాతి ఓవర్‌లో అద్భుతం చేశాడు.Vaibhav Suryavanshi bowling


28వ ఓవర్‌లో వైభవ్.. లింగ్‌డోహ్‌ను ఔట్ చేసి తన తొలి ఫస్ట్ క్లాస్ వికెట్ సాధించాడు. ఆ తర్వాత మరో మూడు బంతులకే వైభవ్ మరో వికెట్‌ను పడగొట్టాడు. నార్త్ ఈస్ట్ జోన్ బ్యాటర్ ఇమ్లివాటి లెమ్తుర్ బ్యాట్ అంచును తాకిన బంతిని కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఒకే ఓవర్‌లో వైభవ్ రెండు వికెట్లు సాధించాడు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈస్ట్‌ జోన్‌ గెలుపు దిశగా సాగుతోంది. ఫాలో ఆన్‌ ఆడుతున్న నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా వెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. దీనికి ముందు ఈస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.


ఇవి కూడా చదవండి:

సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా దినేశ్ కార్తీక్ సరైనోడు: మాథ్యూ హేడెన్

దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. వీడియో వైరల్

Updated Date - Aug 25 , 2026 | 01:58 PM