భారత్‌పై సాధించిన ఆ విజయమే మా పతనానికి కారణం: పాక్ మాజీ కెప్టెన్
ABN , Publish Date - Sep 07 , 2026 | 03:12 PM
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ యూసుఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌పై సాధించిన ఓ విజయం పాకిస్థాన్ క్రికెట్ పతనానికి కారణమైందని అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ యూసుఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌పై సాధించిన ఓ విజయం పాకిస్థాన్ క్రికెట్ పతనానికి కారణమైందని అన్నాడు. 2021 టీ20 ప్రపంచ కప్‌లో దుబాయ్ వేదికగా భారత్‌పై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత గొప్పలకు పోయి పొగరుగా వ్యవహరించారని.. ఆ జట్టు ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణాల్లో అదొకటని వివరించాడు.
‘2021 టీ20 ప్రపంచ కప్‌లో పాక్ బ్యాటర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ అద్భుతంగా రాణించారు. భారత్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. ఆ విజయం తర్వాత కొంతమంది ప్లేయర్లు తాము ఏదో గొప్ప ఘనత సాధించామని భావించారు. అదే తీరును కొనసాగించారు. ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ అదే స్థాయిలో ఆడలేకపోయారు. మీరు బాగా ఆడుతున్నప్పుడు కూడా వినయంగా ఉండటం నేర్చుకోవాలి. కాలర్ ఎగరేసుకుని, ఇతరులను అగౌరవపరిస్తే సమస్యలు వస్తాయి. పాకిస్థాన్ క్రికెట్‌లో ఇప్పుడు అలాంటే సమస్యలే చాలా వచ్చాయి’ అని యూసుఫ్ వెల్లడించాడు.
కెప్టెన్సీ కోసం పోటీ
జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్సీ అంశం కూడా విభేదాలకు దారితీసిందని యూసుఫ్ వెల్లడించాడు. ప్రతి ఒక్కరూ పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్ కావాలని ప్రయత్నించారని, దాని ప్రభావం ఇప్పటికీ జట్టుపై ఉందని చెప్పాడు. ‘జట్టులో ప్రతి ఒక్కరూ జట్టుకు కెప్టెన్ కావాలని చూస్తున్నారు. దాని పరిణామాలు ఇప్పటికీ పాకిస్థాన్ క్రికెట్‌ను వెంటాడుతున్నాయి. ఇటీవల పాక్ చాలా దారుణమైన క్రికెట్ ఆడింది. పీసీబీ ఎప్పటికప్పుడు జట్టుకు మద్దతుగా నిలుస్తోంది. జట్టును మెరుగుపర్చేందుకు ఎంతో మంది కోచ్‌లు వచ్చారు.. వెళ్లారు. ఎన్నో మార్పులు చేశారు. అయినప్పటికీ ఒక్క ఆటగాడు కూడా ముందుకొచ్చి పూర్తి బాధ్యత తీసుకోలేదు’ అని యూసుఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి:
షఫాలీని ఔట్ చేసి.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఓవరాక్షన్!
ప్లేయర్ల ఫోన్ల స్వాధీనం.. పాకిస్థాన్ క్రికెట్‌లో అసలేం జరుగుతోంది?