Share News

అరంగేట్రంలోనే మానవ్ సుతార్ అరుదైన ఘనత

ABN , Publish Date - Jun 08 , 2026 | 07:56 PM

అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా 300 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత యువ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. బంతితో, బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరిసి ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

అరంగేట్రంలోనే మానవ్ సుతార్ అరుదైన ఘనత
Manav Suthar debut

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా 300 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత యువ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. బంతితో, బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరిసి ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు వేసి 6 వికెట్లు తీశాడు. దీంతో టెస్టు అరంగేట్రంలోనే ఆరు వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా రికార్డు స‌ష్టించాడు.


అయితే సుతార్ ఘనత కేవలం బౌలింగ్‌కే పరిమితం కాలేదు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో 41 బంతుల్లో 28 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాకుండా మ్యాచ్‌లో మొత్తం మూడు క్యాచ్‌లు కూడా పట్టాడు. దీంతో టెస్టు అరంగేట్రంలోనే 25కిపైగా పరుగులు, ఐదుకి పైగా వికెట్లు, మూడుకి పైగా క్యాచ్‌లు అందుకున్న నాలుగో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతడి కంటే ముందు ఆల్‌బర్ట్ ట్రోట్(1895), అలెక్స్ కెన్నెడీ(1922), జోయెల్ గార్నర్ (1977) మాత్రమే ఈ ఘనతను సాధించారు. 1977లో గార్నర్ ఈ రికార్డు నెలకొల్పిన తర్వాత 49 ఏళ్ల పాటు ఎవరూ ఈ ఘనతను అందుకోలేకపోయారు. ఇప్పుడు భారత్ ఆడిన 1824వ టెస్టు మ్యాచ్‌లో సుతార్ ఆ అరుదైన జాబితాలో చేరాడు.


మరో రికార్డు..

ఈ మ్యాచ్‌లో మొత్తం ఏడు వికెట్లు తీసిన సుతార్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కూడా అందుకున్నాడు. టెస్టు అరంగేట్రంలోనే ఈ అవార్డు గెలిచిన తొమ్మిదో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో ప్రవీణ్ ఆమ్రే, ఆర్‌పీ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్.. మానవ్ సుతార్‌కు ముందున్నారు.


ఇవి కూడా చదవండి:

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు: టీమిండియా ఘన విజయం

వైభవ్‌పై అంచనాలు పెంచుకోవద్దు: సౌరభ్ గంగూలీ

Updated Date - Jun 08 , 2026 | 08:49 PM