Share News

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గాయం.. ఫొటోను పంచుకున్న కృనాల్ పాండ్య

ABN , Publish Date - May 11 , 2026 | 06:02 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయర్ కృనాల్ పాండ్యకు తీవ్ర గాయమైంది. దానికి సంబంధించిన ఫొటోను అతడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గాయం.. ఫొటోను పంచుకున్న కృనాల్ పాండ్య
Krunal Pandya

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు పోరాడిన ఆర్సీబీ.. ఈ గెలుపుతో అగ్రస్థానానికి చేరుకుంది. దాదాపు ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 46 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా మొండిగా క్రీజులో నిలబడ్డాడు. కాలు పట్టేసినా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇదే సమయంలో కార్బిన్ బాష్ బౌలింగ్‌లో కృనాల్‌కు తీవ్ర గాయమైంది. దానికి సంబంధించిన ఫొటోను అతడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.


ఓ వైపు కాలు పట్టేసి తీవ్ర ఇబ్బంది పడుతున్నా జట్టు కోసం షాట్లు బాదేస్తున్నాడు. ఇదే సమయంలో ముంబై బౌలర్ బాష్ బౌలింగ్‌లో కృనాల్ కడుపుపై తీవ్ర గాయమైంది. ఫిజియో వచ్చి చికిత్స చేసిన తర్వాత పుంజుకుని భారీ షాట్లు ఆడాడు. అయితే మ్యాచ్‌లో తగిలిన గాయం ఫొటోను పంచుకుంటూ కృనాల్ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టాడు. ‘కొన్ని గుర్తులు పోరాటం వృథా కాలేదని చెబుతాయి’ అంటూ భావోద్వేగంగా క్యాప్షన్ ఇచ్చాడు. ఆ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘అప్పుడు గాయం తీవ్రత తెలియలేదు కానీ చాలా గట్టిగానే తగిలింది’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘కాలు పట్టేసినా, గాయమైనా.. జట్టుకు విజయాన్ని అందించాడు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆర్సీబీ విజయం సాధించడంతో ఐపీఎల్ 2026 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అధికారికంగా ఎలిమినేట్ అయ్యాయి. 14 పాయింట్లతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?

భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్

Updated Date - May 11 , 2026 | 06:03 PM