Share News

ధోనీ ఇచ్చిన ఆ సలహానే నా ఇన్నింగ్స్‌కు కారణం: ఉర్విల్ పటేల్

ABN , Publish Date - May 11 , 2026 | 04:03 PM

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీతో మాట్లాడానని, అతడితో జరిపిన సంభాషణ తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ చెప్పాడు.

ధోనీ ఇచ్చిన ఆ సలహానే నా ఇన్నింగ్స్‌కు కారణం: ఉర్విల్ పటేల్
Urvil Patel

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2026లో భాగంగా ఆదివారం లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై విజయంలో ఉర్విల్‌ పటేల్‌ కీలక పాత్ర పోషంచాడు. ఉర్విల్ (65) పూనకం వచ్చినట్లు ఎల్ఎస్‌జీ బౌలర్లపై విరుచుకపడ్డాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి, విజయానికి గట్టి పునాది వేశాడు. తాజాగా తన మెరుపు ఇన్నింగ్స్ కారణం ఏమిటో ఉర్విల్ వెల్లడించాడు.లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీతో మాట్లాడానని, అతడితో జరిపిన సంభాషణ తనను పునరుత్తేజపరిచిందని ఉర్విల్ పటేల్ చెప్పాడు.


‘గత మ్యాచుల్లో నేను త్వరగా ఔటైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ‘మహీ భాయ్’ పక్కన కూర్చున్నాను. ‘భయ్యా.. నాకు మంచి ఆరంభాలు లభిస్తున్నాయి. కానీ, నేను తొందరగా ఔటైపోతున్నాను. నా ఇన్నింగ్స్ ను పెద్ద స్కోర్లుగా మలచడానికి నేనేం చేయాలి?’ అని అడిగాను. దానికి ధోనీ నాతో ఒకే ఒక్క విషయం చెప్పారు. ‘నీ నైపుణ్యాల పట్ల నాకు ఎలాంటి సందేహమూ లేదు. ఏ సందేహం ఉన్నా అది నీ మనసులోనే ఉంది. కాబట్టి నువ్వే స్పష్టంగా ఆలోచించు. సరైన బంతిని సరైన ప్రదేశాలకు కొట్టడానికి ప్రయత్నించు’ అని ధోనీ సలహా ఇచ్చాడని ఉర్విల్ చెప్పాడు.


ధోనీ ఇచ్చిన భరోసా తనలోని సందేహాలను తొలగించి, తన సహజమైన దూకుడు బ్యాటింగ్ వెలుగులోకి వచ్చేలా చేసిందని ఉర్విల్ వెల్లడించాడు. తన ధోని పంచుకున్న జ్ఞానానికి ధన్యవాదాలు తెలుపుతానని తెలిపాడు. తన ప్రదర్శనపై సంతోషంగా అనిపించిందని, ధోని కూడా చాలా సంతోషిస్తారని అనుకుంటున్నట్లు ఉర్విల్ అన్నాడు. ఈ హాఫ్ సెంచరీని ఉర్విల్ తన తండ్రికి అంకితం చేశాడు. అర్ధ శతకం పూర్తికాగానే సంబరాలు చేసుకుంటూ తన జేబులో నుంచి ఓ పేపర్ తీశాడు. ‘నాన్న ఇది నీ కోసమే..’ అని దానిపై ఉంది.


గతంలో తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకుని ఉర్విల్ ఎమోషనల్ అయ్యాడు. ‘నువ్వు బ్యాటింగ్ చేస్తున్న తీరు నాకు చాలా నచ్చింది. ఇలాగే ఆడుతూ ఉండు. నువ్వు పరుగులు సాధించినా, సాధించకపోయినా నాకేమీ ఫర్వాలేదు. స్వేచ్ఛగా ఆడు, నీ నుంచి మేము ఏమీ ఆశించడం లేదు. నువ్వు ఈ స్థాయిలో ఉన్నందుకు మాకు గర్వంగా ఉందని ఆయన నాతో చెబుతుంటారు’ అని తన తండ్రి మాటలను ఉర్విల్ గుర్తుచేసుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

రెండు జట్లు ఔట్.. మిగిలిన జట్ల ప్లేఆఫ్స్ లెక్కలివే.!

ఆర్సీబీ కోచ్‌పై బీసీసీఐ సీరియస్.. ఎందుకంటే?

Updated Date - May 11 , 2026 | 04:13 PM