Share News

ఐసీసీ వన్డే వార్షిక ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలోనే టీమిండియా

ABN , Publish Date - May 11 , 2026 | 05:11 PM

వన్డే వార్షిక ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. భారత జట్టు 118 రేటింగ్ పాయింట్లతో మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఘన విజయం సాధించిన టీమిండియా.. తాజా ర్యాంకింగ్స్‌లో తమ ఆధిపత్యాన్ని చాటింది.

ఐసీసీ వన్డే వార్షిక ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలోనే టీమిండియా
ICC ODI Rankings

ఇంటర్నెట్ డెస్క్: వన్డే వార్షిక ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. భారత జట్టు 118 రేటింగ్ పాయింట్లతో మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలోనూ టీమిండియానే అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ 2026 గెలవడంతో పొట్టి ఫార్మాట్‌లోనూ భారత్ పై చేయి సాధించింది. కాగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఘన విజయం సాధించిన టీమిండియా.. తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో తమ ఆధిపత్యాన్ని చాటింది. న్యూజిలాండ్ 113 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. 109 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే భారత్ కంటే న్యూజిలాండ్ కేవలం 5 పాయింట్ల తేడాతోనే రెండో స్థానంలో ఉండటం విశేషం.


అద్భుత ప్రదర్శనలతో వరుస విజయాలు సాధించిన సౌతాఫ్రికా 102 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో పాకిస్థాన్(98)ను వెనక్కి నెట్టింది. ఇదిలా ఉంటే, ఇదొక్కటి తప్పించి టాప్ 10 జట్ల జాబితాలో ఎలాంటి మార్పు లేదు. శ్రీలంక(96), అఫ్గానిస్థాన్(93), ఇంగ్లండ్(89), బంగ్లాదేశ్(84), వెస్టిండీస్(74) పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఐర్లాండ్ 54 పాయింట్లతో 11వ స్థానానికి చేరి జింబాబ్వేను వెనక్కి నెట్టింది. జింబాబ్వే 53 పాయింట్లతో 12వ స్థానానికి పడిపోయింది. మరోవైపు అమెరికా 46 పాయింట్లతో 13వ స్థానానికి ఎగబాకి స్కాట్లాండ్‌ను అధిగమించింది. స్కాట్లాండ్ ప్రస్తుతం 44 పాయింట్లతో 14వ స్థానంలో ఉంది.


ఐసీసీ ప్రకటించిన నిబంధనల ప్రకారం 2027 మార్చి 31 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 8లో నిలిచే జట్లు నేరుగా వన్డే వరల్డ్‌ కప్‌ 2027కు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలైన సౌతాఫ్రికా, జింబాబ్వే ఇప్పటికే టోర్నీకి నేరుగా అర్హత పొందాయి. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా టాప్ 8లోనే కొనసాగితే 9వ స్థానంలో ఉన్న మరో జట్టుకు ప్రత్యక్ష అర్హత లభించే అవకాశం ఏర్పడనుంది. దీంతో ప్రస్తుతం 9వ స్థానం కోసం పోటీ ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?

భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్

Updated Date - May 11 , 2026 | 05:11 PM