Share News

చెత్త బ్యాటర్ ట్యాగ్ కోసం ఆ ఇద్దరు పోటీ పడుతున్నారు.. క్రిస్ శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 21 , 2026 | 08:20 PM

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానె, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ పరుగులు రాబట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ వారిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.

చెత్త బ్యాటర్ ట్యాగ్ కోసం ఆ ఇద్దరు పోటీ పడుతున్నారు.. క్రిస్ శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు
Kris Srikkanth

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. యువ ప్లేయర్లు అద్భుత ప్రదర్శనలతో సత్తా చాటుతున్నారు. వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే, ప్రియాంశ్ ఆర్య వంటి ప్లేయర్లు అదరగొడుతున్నారు. అయితే సీనియర్ ప్లేయర్ల ఫామ్ లేమి కూడా ఆందోళన కలిగిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానె, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ పరుగులు రాబట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ వారిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.


‘రియాన్ పరాగ్ కెప్టెన్సీ మాత్రమే చేస్తున్నాడు.. కానీ ఓ బ్యాటర్‌గా పరుగులు మాత్రం చేయట్లేడు. మైదానంలో కేవలం స్టైల్‌గా నడవడం.. ఫొటోలకు స్టిల్స్ ఇవ్వడం తప్ప ఏం చేయడు. ఎప్పుడో ఒక మంచి సీజన్ ఆడాడు అంతే.. అప్పటి నుంచి అతడికి హైప్ ఇవ్వడం ప్రారంభించారు. ఆర్ఆర్ జట్టులో మంచి ప్లేయర్లు ఉన్నారు. వారిని సరిగ్గా వినియోగించుకోవడంలో పరాగ్ విఫలమవుతున్నాడు. మరోవైపు కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానె పరిస్థితి కూడా అదే. పరాగ్, రహానె.. వీరిద్దరూ ఈ సీజన్‌లో చెత్త బ్యాటర్ ట్యాగ్ కోసం పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఆ ట్యాగ్ కచ్చితంగా ఒకరికి వస్తుంది’ అని క్రిస్ కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు.


ఇదిలా ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ ఆడిన ఆరు మ్యాచుల్లో 4 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఏడు మ్యాచులు ఆడి.. కేవలం ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఎట్టకేలకు ఫామ్ అందుకున్న వరుణ్ చక్రవర్తి రాజస్థాన్ రాయల్స్‌పై 3 వికెట్లు తీశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!

కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్

Updated Date - Apr 21 , 2026 | 08:23 PM