ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:33 PM
ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా మహిళలు దూసుకెళ్తున్నారు. టీ20 ఫార్మాట్‌కు సంబంధించిన ర్యాకింగ్స్ జాబితాను తాజాగా ఐసీసీ ప్రకటించింది. యువ ప్లేయర్ షెఫాలీ వర్మ టాప్ 5లోకి అడుగుపెట్టడానికి అత్యంత చేరువలో ఉంది. మరోవైపు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాప్ 10కి అడుగు దూరంలో ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా మహిళలు దూసుకెళ్తున్నారు. టీ20 ఫార్మాట్‌కు సంబంధించిన ర్యాకింగ్స్ జాబితాను తాజాగా ఐసీసీ ప్రకటించింది. యువ ప్లేయర్ షెఫాలీ వర్మ టాప్ 5లోకి అడుగుపెట్టడానికి అత్యంత చేరువలో ఉంది. మరోవైపు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాప్ 10కి అడుగుదూరంలో ఉంది. కాగా ఆస్ట్రేలియా క్రికెటర్ జార్జియా వాల్ 815 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాతి స్థానాల్లో బెత్ మూనీ(788), హేలీ మ్యాథ్యూస్(767) కొనసాగుతున్నారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన షెఫాలీ.. రెండు స్థానాలు ఎగబాకి 731 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఆమె ఇటీవల సాధించిన వేగవంతమైన అర్ధ శతకం ర్యాంకింగ్స్‌లో ఎదుగుదలకు దోహదపడింది. ఇదే సమయంలో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 762 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఫామ్‌లోకి వచ్చిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. సఫారీలపై తొలి మ్యాచ్‌లో అజేయంగా 47 పరుగులు చేసిన హర్మన్.. రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 639 రేటింగ్ పాయింట్లతో 11వ స్థానానికి చేరుకుంది. టాప్-10లోకి అడుగుపెట్టడానికి అడుగు దూరంలో ఉంది. కాగా జెమీమా రోడ్రిగ్స్ 637 పాయింట్లతో 14వ స్థానానికి పడిపోయింది.
బౌలింగ్ విభాగంలో..
బౌలింగ్ విభాగంలో పాకిస్థాన్ ప్లేయర్ సాదియా ఇక్బాల్ 743 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని కాపాడుకుంది. దక్షిణాఫ్రికాకు చెందిన నాన్‌కులులేకో మలబా ఏకంగా ఆరు స్థానాలకు ఎగబాకి 704 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. టీమిండియా స్టార్ ప్లేయర్ దీప్తి శర్మ 705 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయింది. రేణుకా సింగ్(699) 9వ స్థానంలో ఉండగా, అరుంధతీ రెడ్డి(665) 12వ స్థానంలో కొనసాగుతోంది. ఆల్‌రౌండర్ల జాబితాలో కెర్ 508 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
ఇవి కూడా చదవండి:
సన్ రైజర్స్- ఢిల్లీ మ్యాచ్‌కు వాన గండం.. వెదర్ రిపోర్ట్ ఇదే!
ఐపీఎల్ 2026: ఒకే సెంచరీ.. పలు రికార్డులు బద్దలు