Share News

గన్‌తో బెదిరించి కెనడా కెప్టెన్‌ను మార్చిన బిష్ణోయ్ గ్యాంగ్.. ఆ ఐదో ఓవర్ వెనక అసలు కథ ఇదే!

ABN , Publish Date - Apr 21 , 2026 | 03:12 PM

ప్రపంచ కప్ నేపథ్యంలో కెనడా జట్టును చుట్టుముట్టిన ఫిక్సింగ్ ఆరోపణలు తాజాగా సంచలనం రేపుతున్నాయి. దీనిపై ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ కూడా విచారణ జరుపుతోంది. దీంట్లో భాగంగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

గన్‌తో బెదిరించి కెనడా కెప్టెన్‌ను మార్చిన బిష్ణోయ్ గ్యాంగ్.. ఆ ఐదో ఓవర్ వెనక అసలు కథ ఇదే!
Bishnoi gang

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసి దాదాపు రెండు నెలలు అవుతోంది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి టీమిండియా ట్రోఫీని ముద్దాడింది. ప్రపంచ కప్ నేపథ్యంలో కెనడా జట్టును చుట్టుముట్టిన ఫిక్సింగ్ ఆరోపణలు తాజాగా సంచలనం రేపుతున్నాయి. దీనిపై ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ విచారణ జరుపుతోంది. దీంట్లో భాగంగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రికెట్ కెనడా ఫిక్సింగ్ ఆరోపణల్లో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పాత్ర ఉందన్న ఆరోపణలు క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తున్నాయి.


గన్‌తో బెదిరించి..

టీ20 ప్రపంచ కప్ టోర్నీకి కేవలం మూడు వారాల ముందు అనూహ్యంగా క్రికెట్ కెనడా.. తమ జట్టు కెప్టెన్‌ను మార్చింది. ఉన్నట్టుండి దిల్ప్రీత్ బజ్వాను కెప్టెన్‌గా ప్రకటించింది. ఈ అంశంపై కూడా ఐసీసీ అవినీతి నిరోధక టీమ్ విచారణ జరిపింది. కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ కథనం ప్రకారం.. జులై 2025లో బ్రిటీష్ కొలంబియాలోని ఒక రెస్టారెంట్‌లో జరిగిన సంఘటన ఈ ఫిక్సింగ్‌ కుంభకోణానికి పునాది వేసింది. అక్కడ భోజనం చేస్తున్న కెనడా జాతీయ జట్టు స్టార్ ప్లేయర్ దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చి తాము బిష్ణోయ్ గ్యాంగ్ ప్రతినిధులమని పరిచయం చేసుకున్నారట. దిల్ప్రీత్ బజ్వాను జట్టులోకి తీసుకోవడమే కాకుండా.. అతడిని కెప్టెన్‌గా నియమించడానికి మద్దతు ఇవ్వాలని.. లేదంటే కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించినట్లు సమాచారం. పాయింట్ బ్లాకులో గన్ పెట్టి బెదిరించి జట్టు కెప్టెన్‌ను అనూహ్యంగా మార్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి.


వివాదాస్పదంగా ఐదో ఓవర్..

టీ20 ప్రపంచ కప్ 2026లో గ్రూప్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా వేసిన ఐదో ఓవర్ అనుమానాస్పదంగా మారిందని కెనడాకు చెందిన ఇన్వెస్టిగేటివ్ కార్యక్రమం ‘ది ఫిఫ్త్ ఎస్టేట్’ తెలిపిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి కేవలం 35 పరుగులే చేసిన కివీస్.. బజ్వా వేసిన ఐదో ఓవర్లో 15 పరుగులు రాబట్టింది. అందులో ఒక నో బాల్, ఒక వైడ్ ఉండటం గమనార్హం. అక్కడి నుంచి మ్యాచ్ స్వరూపమే మారిపోయిందని సదరు డాక్యుమెంటరీ ఆరోపణ. ఈ అంశంపై కూడా ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ కన్నేసింది. బజ్వాను ప్రశ్నించడమే కాకుండా, మొబైల్ ఫోన్‌ను కూడా పరిశీలించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గ్యాంగ్‌స్టర్లతో అతడికి లింకులు ఉన్నట్లు వెలుగులోకి వస్తున్నాయి. జైలులో ఉంటూనే నెట్‌వర్క్ నడిపే బిష్ణోయ్.. ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ మాఫియాలోకి కూడా ప్రవేశించాడని కథనాలు వెల్లడిస్తున్నాయి.


బోర్డు ప్రమేయం ఉందా..?

కేవలం ఆటగాళ్లే కాకుండా, క్రికెట్ కెనడా ప్రెసిడెంట్ అరవిందర్ ఖోసా కూడా ఈ ముఠాకు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దిల్ప్రీత్ బజ్వాను కెప్టెన్ చేయడంలో ఖోసా కీలక పాత్ర పోషించారని, ఇది కేవలం మ్యాచ్‌లు ఫిక్స్ చేసి డబ్బు సంపాదించడానికే అని కొందరు బోర్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఖోసా ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. ఇదంతా తనపై జరుగుతున్న రాజకీయ కుట్ర అని ఆయన వాదిస్తున్నారు. మరోవైపు, మాజీ కోచ్ ఖుర్రం చోహన్ కూడా గతంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం బోర్డు సభ్యుల నుంచి ఒత్తిడి ఎదుర్కొన్నట్లు పేర్కొనడం సంచలనం రేపుతోంది. మొత్తంగా చూస్తే, కెనడా క్రికెట్ చుట్టూ ఏర్పడిన ఈ ఫిక్సింగ్ మబ్బులు అంతర్జాతీయ క్రికెట్‌లో కలకలం రేపుతున్నాయి. బిష్ణోయ్ గ్యాంగ్ పాత్ర నిజమైతే, ఇది కేవలం క్రీడా అవినీతి కాకుండా అంతర్జాతీయ స్థాయి నేర జాలం వరకు విస్తరించిన కేసుగా మారే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ఒకే సెంచరీ.. పలు రికార్డులు బద్దలు

ఐపీఎల్ 2026: తొలి సెంచరీపై తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు

Updated Date - Apr 21 , 2026 | 03:13 PM