కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:41 PM
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న సీఎస్కే బ్యాటర్ ఆయుశ్ మాత్రే ఐపీఎల్‌కు దూరమయ్యాడు. కండరాల గాయం కారణంగా మిగతా సీజన్‌లో అతడు ఆడబోడని సీఎస్కే ఎక్స్ వేదికగా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న సీఎస్కే బ్యాటర్ ఆయుశ్ మాత్రే ఐపీఎల్‌కు దూరమయ్యాడు. కండరాల గాయం కారణంగా మిగతా సీజన్‌లో అతడు ఆడబోడని సీఎస్కే ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఏప్రిల్ 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ఆయుశ్ తొడ కండరాల గాయానికి గురైన సంగతి తెలిసిందే. అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు 6-12 వారాల సమయం పడుతుందని టీమ్ వెల్లడించింది.
18 ఏళ్ల ఆయుశ్ మాత్రే ఈ సీజన్‌లో సీఎస్కేకు అత్యంత కీలక ప్లేయర్. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 201 పరుగులు సాధించి, 177 స్ట్రైక్ రేట్‌తో దూసుకెళ్లాడు. రెండు హాఫ్ సెంచరీలతో జట్టుకు వేగవంతమైన ఆరంభాలు అందిస్తూ ఈ ఏడాది సీఎస్కే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్టార్ ప్లేయర్ ఇలా గాయంతో టోర్నీకి దూరమవ్వడం.. సీఎస్కే జట్టుకు పెద్ద లోటే.
ప్రత్యామ్నాయం ఎవరంటే...?
ఆయుశ్ మాత్రే టోర్నీకి దూరం అవ్వడంలో సీఎస్కే మేనేజ్‌మెంట్‌కు ప్రత్యామ్నాయంపై తలనొప్పి మొదలైంది. మాత్రే తరహాలో అగ్రెసివ్ బ్యాటింగ్ సామర్థ్యం ఉన్న ప్లేయర్ల లిస్ట్‌లో ఉర్విల్ పటేల్ ముందంజలో ఉన్నాడు. గత సీజన్‌లో 28 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు, అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా భారీ ధరకు కొనుగోలు చేసిన కార్తిక్ శర్మ కూడా ఒక ఎంపికగా ఉన్నా.. అతడి ఫామ్ స్థిరంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. యువ ఆటగాడు స్వస్తిక్ చికారా పవర్‌ప్లేలో దూకుడు చూపించే సామర్థ్యంతో మరో ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు. మొత్తంగా, మాత్రే గాయం సీఎస్కేకు పెద్ద తలనొప్పిగా మారగా, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేయడం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. కాగా చెన్నై జట్టు ఇప్పటికి ఆరు మ్యాచుల్లో రెండు గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
సన్ రైజర్స్- ఢిల్లీ మ్యాచ్‌కు వాన గండం.. వెదర్ రిపోర్ట్ ఇదే!
ఐపీఎల్ 2026: ఒకే సెంచరీ.. పలు రికార్డులు బద్దలు