Share News

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Mar 25 , 2026 | 07:27 AM

వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్, కేకేఆర్‌ లెజెండరీ ఆండ్రూ రస్సెల్‌ ఈ సీజన్‌కు ముందు ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయం
Andre Russell

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్, కేకేఆర్‌ లెజెండరీ ఆండ్రీ రస్సెల్‌ ఈ సీజన్‌కు ముందు ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దీంతో అతడి జెర్సీ నంబర్ 12ను కూడా రిటైర్ చేస్తూ రస్సెల్‌కు ఘన వీడ్కోలు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ఓ ఫ్రాంచైజీ జెర్సీ నంబర్‌ను అధికారికంగా రిటైర్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.


ఐపీఎల్ 2026కి ముందు కేకేఆర్ ‘నైట్స్ అన్‌ప్లగ్డ్’ అనే ప్రి సీజన్‌ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ‘రస్సెల్.. నీకు మేమిచ్చే బహుమానం ఇదే. నీ జెర్సీ నంబర్ 12ను కూడా రిటైర్ చేస్తున్నాం. ఈ జెర్సీ నీకే సొంతం’ అని అతడికి ఘన వీడ్కోలు పలికారు. కేకేఆర్ జట్టుతో దశాబ్దానికి పైగా అనుబంధం కలిగిన రస్సెల్.. 2014, 2024 టైటిల్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇది వరకు భారత క్రికెట్‌లో బీసీసీఐ మాత్రమే జెర్సీ నంబర్లను రిటైర్ చేసింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10, ఎంఎస్ ధోనీ జెర్సీ నంబర్ 7లను రిటైర్ చేశారు. అయితే ఐపీఎల్‌లో ఇలాంటి నిర్ణయం ఇప్పటివరకు ఎప్పుడూ తీసుకోలేదు.


రస్సెల్ భావోద్వేగం..

ఈ సందర్భంగా రస్సెల్ కెరీర్‌ను ప్రతిబింబించే వీడియోను ప్రదర్శించారు. దీంతో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అతడు భావోద్వేగానికి లోనయ్యాడు. ‘దశాబ్దానికి పైగా ఈ జట్టుతో ఎన్నో విజయాలు సాధించాను. రెండు టైటిల్స్ గెలిచాం. ఆ జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు మెదిలాయి. అది చూసి కళ్లలో నీళ్లు వచ్చాయి. ప్రతి మ్యాచ్‌ను నా చివరి మ్యాచ్‌లా ఆడాను’ అని రస్సెల్ వెల్లడించాడు. తాజా సీజన్‌కు ముందు రస్సెల్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ఆసక్తికరంగా అతను వేలంలోకి వెళ్లకుండా కేకేఆర్ ఆఫర్‌ను అంగీకరించి ‘పవర్ కోచ్’గా కొత్త బాధ్యతలు స్వీకరించాడు. ఇకపై యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టనున్నాడు.


ఇవి కూడా చదవండి:

థామస్ కప్‌2026: భారత్ జట్టుకు సారథ్యం వహించనున్న లక్ష్య సేన్

ఐపీఎల్ చరిత్రలో భారీ డీల్.. చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్

Updated Date - Mar 25 , 2026 | 09:00 AM