ఐపీఎల్ అ‘ధర’హో!
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:34 AM
భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) మానస పుత్రిక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వాణిజ్య విలువ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్థాన్ రాయల్స్....
ఐపీఎల్ 3 రోజుల్లో
భారీ మొత్తాలకు అమ్ముడైన రాజస్థాన్, బెంగళూరు ఫ్రాంచైజీలు
భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) మానస పుత్రిక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వాణిజ్య విలువ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) ఫ్రాంచైజీలపై జరిగిన భారీ విక్రయ ఒప్పందాలే ఇందుకు నిదర్శనం. ఈ రెండు జట్లు ఇప్పుడు కళ్లు చెదిరే స్థాయిలో ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముడై చరిత్ర సృష్టించాయి. భారత సంతతికి చెందిన అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ సారథ్యంలోని కన్సార్టియం రూ. 15,300 కోట్లతో రాజస్థాన్ జట్టును కొనుగోలు చేయగా.. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్స్‌లతో కూడిన కన్సార్టియం రూ. 16,750 కోట్లు వెచ్చించి ఆర్సీబీని సొంతం చేసుకుంది. ఈ సీజన్ ముగిసిన అనంతరం రెండు జట్లు కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్తాయి.
ఆరంభంలో ఇలా..
2008 తొలి వేలంలో పాల్గొన్న 8 జట్లలో ముంబై రూ. 448 కోట్లతో అగ్రస్థానాన ఉంది. బెంగళూరు రెండో స్థానంలో, రాజస్థాన్ ఆఖరి స్థానంలో నిలిచాయి.
2008లో బెంగళూరు ధర: రూ. 446 కోట్లు
రాజస్థాన్ ధర: రూ. 268 కోట్లు
రాజస్థాన్‌కు రూ.15 వేల కోట్లు
అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ హస్తగతం
న్యూఢిల్లీ: ఐపీఎల్ మొదటి చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం మారింది. అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును రూ.15,300 కోట్ల భారీ మొత్తంతో కొనుగోలు చేసింది. ఈ కన్సార్టియంలో వాల్‌మార్ట్ గ్రూప్ కూడా ఉంది. రాయల్స్‌ను చేజిక్కించుకునేందుకు మంగళవారం జరిగిన బిడ్డింగ్‌లో సోమానీకి టైమ్స్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, మిట్టల్ గ్రూప్ పోటీ ఇచ్చాయి. ఈ కొనుగోలు వ్యవహారాన్ని బీసీసీఐ ఇంకా ఆమోదించాల్సి ఉంది. ఈనెల 28 నుంచి జరిగే సీజన్ ముగిశాక ఆర్‌ఆర్ జట్టు కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లనుంది. ఇదిలావుండగా.. తాజా డీల్‌తో ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు తర్వవత రాజస్థాన్ రాయల్స్ రెండో అత్యంత ఖరీదైన జట్టుగా నిలిచింది.
బ్రాండ్ వ్యాల్యూ పైపైకి..: 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ లీగ్‌లో కొనసాగుతోంది. అప్పట్లో ఆయా జట్ల కోసం జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 447 కోట్లతో టాప్‌లో నిలవగా.. రాజస్థాన్‌ను అత్యల్పంగా కేవలం రూ. 268 కోట్లకు ఎమర్జింగ్ మీడియా దక్కించుకుంది.

లలిత్ మోదీ బంధానికి ముగింపు!
రాజస్థాన్ ఫ్రాంచైజీ విక్రయంతో ఆ జట్టుపై లలిత్ మోదీ ప్రభావం ఏమైనా ఉన్నా అది పూర్తిగా తొలిగిపోయినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్ మాజీ కమిషనర్‌గా కొనసాగిన లలిత్ రాజస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త. అప్పట్లో అన్నీ తానై లీగ్‌ను నడిపించిన మోదీకి ఎన్నో ఏళ్లుగా రాజస్థాన్ జట్టుతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు ఉన్నాయనే కథనాలు వినిపించాయి. అతను ఎప్పటికప్పుడు వీటిని ఖండించినా ఆ వదంతులు సద్దుమణగలేదు. తాజాగా యూఎస్ కంపెనీ జట్టు పగ్గాలు తీసుకోవడంతో మోదీకి ఆ జట్టుతో బంధానికి తెరపడినట్టే.
ఎవరీ సోమానీ?
భారత సంతతికి చెందిన కల్ సోమానీ అమెరికాలోని ఆరిజోనాకు చెందిన వ్యాపారవేత్త. టెక్నాలజీ సెక్టార్‌లో పలు కంపెనీలను నెలకొల్పాడు. ఇంట్రాఎడ్జ్, ట్రుయో.ఏఐ, అకాడెమియన్‌లకు చైర్మన్‌గా ఉన్నాడు. ప్రస్తుత రాజస్థాన్ ఐపీఎల్ జట్టులో మైనర్ వాటాదారుడిగా ఉన్న సోమానీ క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలపైనా పెద్ద మొత్తంలో వెచ్చించాడు. మోటార్ సిటీ గోల్ఫ్ క్లబ్‌కు సహ యజమానిగా ఉండడంతో పాటు టీజీఎల్ గోల్ఫ్ లీగ్, టీఎంఆర్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌లోనూ తొలి దశలో పెట్టుబడులు పెట్టాడు.
బెంగళూరుకు రూ. 16 వేల కోట్లు
బిర్లా
కన్సార్టియం సొంతం
బెంగళూరు: లీగ్‌లో ఎంతో ఆదరణ కలిగిన డిఫెండింగ్ చాంప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కూడా వేల కోట్లకు చేతులు మారింది. ఆదిత్య బిర్లా గ్రూప్ (ఏబీసీ) నేతృత్వంలోని కన్సార్టియం సుమారు రూ. 16,750 కోట్ల భారీ ధరకు బెంగళూరును దక్కించుకొంది. ఈ గ్రూప్‌లో ప్రముఖ ఇన్వె్‌స్టమెంట్ ఫరమ్ బ్లాక్‌స్టోన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, అమెరికా ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్‌కు చెందిన బోల్ట్ వెంచర్స్ భాగస్వాములుగా ఉన్నాయి. ‘ఆర్సీబీలో వంద శాతం వాటా కొనుగోలు కోసం యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎ్‌సఎల్)తో ఒప్పందం కుదుర్చుకొన్నాం. ఇందులో ఫ్రాంచైజీకి చెందిన పురుషులు, మహిళల జట్లు ఉన్నాయ’ని కన్సార్టియం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నూతన యాజమాన్యంలో ఫ్రాంచైజీ చైర్మన్‌గా ఆర్యమన్ విక్రమ్ బిర్లా (ఏబీజీ డైరెక్టర్), వైస్ చైర్మన్‌గా సత్యన్ గజ్వాని (టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్) వ్యవహరించనున్నారు. అయితే, ఈ డీల్ కోసం బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి అధికారిక అనుమతితోపాటు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇతర రెగ్యులేటర్‌ల నుంచి లాంఛనాలను పూర్తి చేయాల్సి ఉంది. 2026 సీజన్ ముగిసిన తర్వాత కొత్త యాజమాన్యం ఆర్సీబీని టేకోవర్ చేయనుంది.

ఆర్యమన్
ఆటగాడే..
బిర్లా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఆర్యమన్ (28) కూడా క్రికెటరే. మధ్యప్రదేశ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడిన అతడు.. కొన్నాళ్లు ఐపీఎల్‌లో రాజస్థాన్ సభ్యునిగా కొనసాగాడు. వేల కోట్ల ఆస్తులున్నా.. వాటిని పక్కనబెట్టి క్రికెటర్ కావాలనుకొన్నాడు. 9 ఫస్ట్ క్లాస్, 4 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు. రాజస్థాన్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నా.. ఒక్కసారి కూడా బరిలోకి దిగే అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఏకంగా ఒక జట్టును సొంతం చేసుకొన్నాడు. జెన్-జి కుర్రాడైన ఆర్యమన్ ఇప్పుడు ఐపీఎల్‌లో ప్రధాన ఆకర్షణ కానున్నాడు.
ముఖ చిత్రాన్నే మార్చేసింది..
గత రెండు దశాబ్దాల్లో ఐపీఎల్.. ప్రపంచ క్రీడా శక్తిగా రూపాంతరం చెందింది. భారత క్రికెట్ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చడమే కాకుండా.. అపార సంపదను సృష్టించింది. లీగ్‌లో అత్యంత ఆదరణగల జట్లలో ఆర్సీబీ ఒకటి. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు తమ సంస్థాగత నిర్మాణ వారసత్వాన్ని ప్రపంచ క్రీడారంగంలో విస్తరించడానికి ఒక విశిష్టమైన వేదికను అందిస్తోంది. దీనికి సంరక్షకులుగా మారినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఇదే వారసత్వాన్ని కొనసాగించాలనుకొంటున్నాం.
కుమార మంగళం బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్
ఇవి కూడా చదవండి:
థామస్ కప్2026: భారత్ జట్టుకు సారథ్యం వహించనున్న లక్ష్య సేన్
ఐపీఎల్ చరిత్రలో భారీ డీల్.. చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్