Share News

థామస్ కప్‌2026: భారత్ జట్టుకు సారథ్యం వహించనున్న లక్ష్య సేన్

ABN , Publish Date - Mar 24 , 2026 | 07:48 PM

ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2026 రన్నరప్‌గా నిలిచిన లక్ష్య సేన్ థామస్ కప్‌లో భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అలాగే వచ్చే నెలలో జరిగే ఉబెర్ కప్‌నకు మాజీ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు, యువ క్రీడాకారిణి ఉన్నతి హూడా మహిళల జట్టుకు నాయకత్వం వహించనున్నారు.

 థామస్ కప్‌2026: భారత్ జట్టుకు సారథ్యం వహించనున్న లక్ష్య సేన్
Lakshya Sen

స్పోర్ట్స్ డెస్క్: ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2026లో రన్నరప్‌గా నిలిచిన లక్ష్య సేన్.. త్వరలో జరగనున్న థామస్ కప్‌కు భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అలాగే వచ్చే నెలలో జరిగే ఉబెర్ కప్‌నకు మాజీ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు, యువ క్రీడాకారిణి ఉన్నతి హూడా మహిళల జట్టుకు నాయకత్వం వహించనున్నారు. ఈ టోర్నీ ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు డెన్మార్క్‌లోని హార్సెన్స్‌లో జరగనుంది. ఈ సారి నాయకత్వం బాధ్యతలను 2022లో థామస్ కప్‌లో చారిత్రాత్మక విజయాన్ని అందించిన జట్టులోని కీలక ఆటగాళ్లకే భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ (BAI) అందించింది. లక్ష్య సేన్, కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్. ప్రణయ్, అలాగే పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలను జట్టులోకి తీసుకుంది.


సీనియర్ విభాగంలో నిలకడగా రాణిస్తున్న యువ షట్లర్ ఆయుష్ శెట్టి తొలిసారిగా పిలుపు అందుకున్నాడు. 2022 టైటిల్ గెలిచిన జట్టు సభ్యుడైన ఎంఆర్ అర్జున్ గాయం నుంచి కోలుకుని పురుషుల జట్టులోకి తిరిగి వచ్చాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన హరిహరన్ అమ్సకరుణన్‌తో కలిసి అర్జున్ డబుల్స్ లైనప్‌ను బలోపేతం చేయనున్నాడు. అదేవిధంగా 2022 డబుల్స్ జట్టులో సభ్యుడైన ధ్రువ్ కపిల కూడా డబుల్స్ లైనప్‌నకు తన అనుభవాన్ని అందించనున్నాడు. అలానే సింగిల్స్‌ను కిరణ్ జార్జ్ మరింత బలోపేతం చేయనున్నాడు.


మరోవైపు ఉబెర్ కప్‌ 2026లో బ్యాడ్మింటన్ స్టార్ సింధు, గాయత్రి గోపీచంద్ ట్రీసా జాలీలు భారత్ తరఫున నాయకత్వం వహించనున్నారు. ఈ టోర్నమెంట్‌లో ఈ సభ్యులు తమ మునుపటి సెమీఫైనల్ ప్రదర్శనల కంటే మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఉన్నతి హూడాతో పాటు, దేవికా సిహాగ్, ఇషారానీ బారువా, టీనేజర్ తన్వి శర్మలతో సహా ఫామ్‌లో ఉన్న యువ క్రీడాకారిణుల బృందం జట్టులో చేరింది.


జట్టు

పురుషులు:

లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి, కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, కిరణ్ జార్జ్, సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, హరిహరన్ అంశకరుణన్, ఎంఆర్ అర్జున్, ధ్రువ్ కపిల.

మహిళలు:

పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవికా సిహాగ్, ఇషారాణి బారుహ్, ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ పుల్లెల, కవిప్రియ సెల్వం, సిమ్రాన్ సింఘి, తనీషా క్రాస్టో.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ చరిత్రలో భారీ డీల్.. చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్

పాకిస్థాన్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన బంగ్లాదేశ్!

Updated Date - Mar 24 , 2026 | 08:26 PM