ఐపీఎల్ చరిత్రలో భారీ డీల్.. చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్
ABN , Publish Date - Mar 24 , 2026 | 07:10 PM
ఐపీఎల్2026 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలోనే భారీ డీల్ కుదిరినట్లు కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కన్సార్టియం అనే సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్2026 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలోనే భారీ డీల్ కుదిరినట్లు కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ (Rajasthan Royals)ని కన్సార్టియం అనే సంస్థ కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇది అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని పని చేస్తోంది. 1.63 బిలియన్ డాలర్లతో ఈ ఫ్రాంచైజీని దక్కించుకున్నట్లు సమాచారం. ఈ విలువ మన ఇండియన్ కరెన్సీలో రూ.15వేల కోట్లు. దీంతో ఒక బిలియన్ డాలర్లకు విక్రయించిన తొలి ఐపీఎల్ జట్టుగా రాజస్థాన్ చరిత్ర సృష్టించింది. ఇక ఈ భారీ డీల్ పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
నివేదికల ప్రకారం.. ఇప్పటికే ఇరువర్గాల మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయని, 2026 ఐపీఎల్ సీజన్ (IPL) తర్వాత కొత్త యజమానులకు ఈ ఫ్రాంచైజీ అప్పగించనున్నారు. ఇంట్రాఎడ్జ్, ట్రుయో, ట్రుయో.ఏఐ, అకాడెమియన్ సంస్థల వ్యవస్థాపకుడు సోమానీ. ఇక కన్సార్టియంలో అమెరికా వ్యాపారవేత్త, ప్రముఖ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ ఛైర్మన్ రాబ్ వాల్టన్ కూడా ఉన్నారు. అగ్రరాజ్యానికే చెందిన మరో వ్యాపార కుటుంబం హాంప్ కుటుంబం కూడా ఈ గ్రూప్‌లో భాగం. నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) జట్టు డెట్రాయిట్ లయన్స్‌లో మెజారిటీ వాటాలు హాంప్ కుటుంబం కలిగి ఉంది.
మరోవైపు ఫ్రాంచైజీలను అమ్మాలని రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొంతకాలం క్రితం నిర్ణయం తీసుకున్నాయి. అయితే కొలంబియా పసిఫిక్ క్యాపిటల్స్ పార్టనర్స్ (సీపీసీపీ) కన్సార్టియం నుంచి రూ.16వేల కోట్ల ఆఫర్ వచ్చినా.. రాజస్థాన్ తిరస్కరించిందని ఇటీవల మీడియా కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీలో ఎమెర్జింగ్ మీడియా వెంచర్స్ అధినేత మనోజ్ బదాలె వాటా 65 శాతం కాగా.. రెడ్‌బర్డ్ క్యాపిటల్‌కు మిగతా వాటా ఉంది. ఇదిలా ఉండగా, గాయం కారణంగా ఇంగ్లీష్ ఆల్-రౌండర్ సామ్ కరన్ టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో అతని స్థానంలో శ్రీలంక ఆల్-రౌండర్ దాసున్ షనకను తీసుకుంటున్నట్లు రాజస్థాన్ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
పాకిస్థాన్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన బంగ్లాదేశ్!
తొక్కిసలాట మృతులకు నివాళిగా... RCB కీలక నిర్ణయం