Share News

తొక్కిసలాట మృతులకు నివాళిగా... RCB కీలక నిర్ణయం

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:33 PM

ఐపీఎల్2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయర్లు 11వ నంబర్ జెర్సీలు ధరించనున్నారు. గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో మరణించిన వారికి నివాళిగా ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకుంది.

తొక్కిసలాట మృతులకు నివాళిగా... RCB కీలక నిర్ణయం
Chinnaswamy tragedy, IPL 2026 RCB

స్పోర్ట్స్ డెస్క్: గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వారికి నివాళిగా ఆర్సీబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయర్లు 11వ నంబర్ జెర్సీలు ధరించనున్నారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సీఈవో రాజేశ్ మేనన్ వెల్లడించారు.


అలానే ఆర్సీబీ మరో నిర్ణయం కూడా తీసుకుంది. కర్ణాటక అసోసియేషన్(కేఎస్‌సీఏ) సహకారంతో చనిపోయిన 11 మంది అభిమానుల పేర్ల మీద చిన్నస్వామి స్టేడియంలో శాశ్వత సీట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భవిష్యత్తులో చిన్నస్వామి స్టేడియంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లతో సహా అన్ని ఈవెంట్లలో ఈ సీట్లు ఖాళీగానే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అలానే తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద 11 మంది అభిమానుల మృతుల జ్ఞాపకార్థం ఒక స్మారక ఫలకాన్ని ఆవిష్కరించనున్నారు.


మంగళవారం ఆర్సీబీ సీఈవో రాజేశ్ మాట్లాడుతూ..'మ్యాచ్ రోజున ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్లందరూ 11వ నంబర్ జెర్సీని ధరిస్తారు. ఇది మాతోనే నడిచిన మా అభిమానులకు మేము అర్పించే నివాళి. అలానే తొలి మ్యాచ్ రోజు ఆటగాళ్లంతా నల్లని కళ్లద్దాలను కూడా ధరిస్తారు. చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లను శాశ్వతంగా కేటాయించాలని మేము భావిస్తున్నాము. ఎప్పటికీ మాకు తోడుగా నిలిచే ఆ 11 మంది అభిమానుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం' అని రాజేశ్ మీనన్ పేర్కొన్నారు.


ఐపీఎల్ 2025 సీజన్‌ ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్సీబీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణ ఫలించడంతో జూన్ 4న బెంగళూరులో ఆర్సీబీ విజయోత్స వేడుక నిర్వహించింది. ఈ విజయోత్స వేడుకలను చూసేందుకు అభిమానులు లక్షల్లో తరలిరావడంతో చిన్నస్వామి స్టేడియం బయట తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా.. 50 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.


ఇవి కూడా చదవండి:

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ పేసర్ యశ్‌పై ఆర్సీబీ కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వ ఉద్యోగిగా మారిన రింకు సింగ్..

Updated Date - Mar 24 , 2026 | 04:39 PM