లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ పేసర్ యశ్‌పై ఆర్సీబీ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 24 , 2026 | 03:35 PM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ యశ్ దయాల్ ఐపీఎల్2026కి దూరంగా కానున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ ఆడటం లేదని ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ అన్నారు.
స్పోర్ట్స్ డెస్క్: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) స్టార్ పేసర్ యశ్ దయాల్‌ను మేనేజ్మెంట్ పక్కనబెట్టింది. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్2026లో యశ్ ఆడబోడని ఆర్సీబీ స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాలతోనే ఈ సీజన్ మ్యాచులకు దూరం కానున్నాడని తెలిపింది. అయితే అతడితో మేనేజ్మెంట్ చేసుకున్న ఒప్పందం కొనసాగుతుందని ఆర్సీబీ వెల్లడించింది.
ఇవాళ(మంగళవారం) ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ మీడియాతో మాట్లాడుతూ.. 'యశ్ దయాల్(Yash Dayal) ఈసారి జట్టులో చేరడం లేదు. అతను కొన్ని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. మేం ఇప్పటి వరకు ఎంతో అండగా నిలిచాం. ఇందులో భాగంగానే వేలంలోకి వదిలేయకుండా రిటైన్ చేసుకున్నాం. మేం అతన్ని జట్టులో కొనసాగించాలని అనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జట్టులో చేరడం జట్టుకు, అతనికి మంచిది కాదని భావించి ఈ సీజన్‌కు దూరంగా ఉంచాలని నిర్ణయించాం. అతనికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఈ ఆరోపణల నుంచి అతడు బయటపడే వరకు మేం అతనితో టచ్‌లోనే ఉంటాం' అని బోబాట్ స్పష్టం చేశారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో యశ్ దయాల్ 13 వికెట్లతో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని గైర్హాజరీ జట్టుకు తీరని లోటని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.
గతేడాది జులైలో దయాల్‌పై రెండు వేర్వేరు రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో అతడిని అరెస్టు చేయొద్దంటూ అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే రాజస్థాన్(Rajasthan)లో నమోదైన కేసులో మాత్రం అతడు బెయిల్‌పై ఉన్నాడు. ఈ క్రమంలోనే గత నెలలో యశ్ దయాల్ రహస్యంగా పెళ్లిచేసుకున్నాడు. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండీర్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు.
ఇవి కూడా చదవండి: