Share News

ఇషాన్ కిషన్ పూర్తి బాధ్యత తీసుకున్నాడు.. అందుకే గెలిచాం: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

ABN , Publish Date - Feb 16 , 2026 | 09:41 AM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. జట్టు గెలుపుపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.

ఇషాన్ కిషన్ పూర్తి బాధ్యత తీసుకున్నాడు.. అందుకే గెలిచాం: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్ స్టేజిలో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో పాక్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ బ్యాటర్లు 114 పరుగులకే కుప్పకూలారు. దీంతో భారత్ నేరుగా సూపర్ 8కు క్వాలిఫై అయింది. పూర్తిగా ఏకపక్షంగా సాగినఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ పాక్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మరీ ముఖ్యంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇషాన్ కిషన్(77) దూకుడుకి పాక్ బౌలర్ల దగ్గర సమాధానమే లేకపోయింది. తమ విజయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) స్పందించాడు.


‘ఇషాన్ కిషన్(Ishan Kishan) అద్భుత ప్రదర్శన కనబర్చాడు. బౌలర్లు కూడా చెలరేగారు. ఈ విజయం భారత్‌కు అంకితం. మేం ఎలాంటి క్రికెట్ ఆడాలనుకున్నామో.. అదే ఆడాం. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నాటి నుంచి నేటి వరకు ఇషాన్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. జట్టు స్కోర్ 0/1 దగ్గర ఉన్నప్పుడు మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌కి కాస్త ఒత్తిడి పెరుగుతుంది. కానీ ఇషాన్ ఎక్కడా తడబడలేదు. మ్యాచ్‌కు సంబంధించి పూర్తి బాధ్యత తీసుకున్నాడు. వికెట్లు పడుతున్నా తన దూకుడును కొనసాగించాడు. తిలక్ వర్మ, దూబే, రింకూ సింగ్ బ్యాటింగ్ తీరు బాగుంది.


ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు ఎంత స్కోర్ సరిపోతుందో అంచనా వేయడం కష్టం. కానీ మేం 175 పరుగులు చేయగానే 15-20 పరుగులు ఎక్కువే చేశామని అనిపించింది. ఒకవేళ 150 పరుగులే చేసి ఉంటే.. మ్యాచ్ ఉత్కంఠగా మారేది. హార్దిక్ అదరహో అనిపించాడు. బుమ్రా తనేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలరో మరోసారి నిరూపించాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు’ సూర్య చెప్పుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి:

భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..

భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్

Updated Date - Feb 16 , 2026 | 09:41 AM