Share News

కివీస్ సిరీస్‌కు భువీని ఎంపిక చేయడమే సెలెక్టర్లు చేసిన తప్పు: ఇర్ఫాన్ పఠాన్

ABN , Publish Date - Nov 02 , 2026 | 08:47 AM

భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. భువీ ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు అతడిని ఎంపిక చేయడమే సెలెక్టర్లు చేసిన తప్పు అని విమర్శించాడు.

కివీస్ సిరీస్‌కు భువీని ఎంపిక చేయడమే సెలెక్టర్లు చేసిన తప్పు: ఇర్ఫాన్ పఠాన్
Irfan Pathan

ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత న్యూజిలాండ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చి తీవ్రంగా నిరాశపరచాడు. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. భువీ ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు అతడిని ఎంపిక చేయడమే సెలెక్టర్లు చేసిన తప్పు అని విమర్శించాడు. టీ20 ప్రపంచ కప్‌నకు ఇంకా చాలా సమయం ఉన్నప్పుడు.. 36 ఏళ్ల భువనేశ్వర్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు.


‘నా అభిప్రాయం ప్రకారం ఈ సిరీస్‌లో భువనేశ్వర్‌ను ఆడించడమే సెలెక్టర్లు చేసిన తప్పు. అతడు మంచి బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సీనియర్ ఆటగాడు కూడా. కానీ టీ20 ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పుడు అతడిని ఈ సిరీస్‌లో ఎందుకు ఆడించారో అర్థం కావడం లేదు. ఒకవేళ రానున్న వన్డే ప్రపంచకప్ కోసం భువనేశ్వర్‌ను సిద్ధం చేయాలనుకుంటే అది కొంతవరకు సమంజసంగా ఉండేది. కానీ ఈ సిరీస్‌లో అతడిని ఆడించడం వల్ల యువ ఫాస్ట్ బౌలర్లకు దక్కాల్సిన అవకాశాన్ని కోల్పోయాం. భువీ స్థానంలో యువ బౌలర్లకు అవకాశం కల్పించి ఉంటే వారికి అంతర్జాతీయ క్రికెట్‌లో విలువైన అనుభవం లభించేది. మయాంక్ యాదవ్‌, ప్రిన్స్ యాదవ్‌లకు కు అన్ని మ్యాచ్‌ల్లో ఆడించాల్సింది. న్యూజిలాండ్ వంటి దేశంలో బౌలింగ్ చేయడం యువ పేసర్లకు మంచి అనుభవాన్ని ఇస్తుంది. అలాంటి అవకాశాన్ని సెలెక్టర్లు కోల్పోయారు. భువీ సరిగ్గా బౌలింగ్ చేయలేదని నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. అతడు తొలి రెండు ఓవర్లలో బాగా బౌలింగ్ చేశాడు. అయితే పవర్‌ప్లే చివరి ఓవర్‌లో పరుగులు సమర్పించుకున్నాడు. ఇలాంటి పరిస్థితులు ఏ ఆటగాడికైనా ఎదురవుతాయి. అతడి బౌలింగ్ నైపుణ్యంపై ఎలాంటి సందేహం లేదు’ అని ఇర్ఫాన్ వెల్లడించాడు.


యువ బౌలర్లను సిద్ధం చేయాలి..

భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలంటే యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ఇర్ఫాన్ సూచించాడు. ‘ఇక్కడ అసలు ప్రశ్న భువనేశ్వర్ ప్రతిభ గురించి కాదు.. అతడిని ఎంపిక చేసిన సమయం గురించి. ఈ సిరీస్‌లో ఒక యువ ఫాస్ట్ బౌలర్‌కు అవకాశం ఇచ్చి ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉండేది. యువ బౌలర్లను అభివృద్ధి చేయాలంటే వారికి అవకాశాలు ఇవ్వాలి. ముఖ్యంగా బౌలింగ్‌లో చిన్న తప్పిదానికే భారీ మూల్యం చెల్లించాల్సిన మంచి పిచ్‌లపై ఆడించాలి. అప్పుడే వారు అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమవుతారు’ అని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.


ఇవి కూడా చదవండి:

ఏపీకి మురసు తుఫాన్ ముప్పు.. నేడు, రేపు అతి భారీ వర్షాలు!

భయమా.. అది నా డిక్షనరీలోనే లేదు: గంభీర్

Updated Date - Nov 02 , 2026 | 08:47 AM