ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే!: ఇర్ఫాన్ పఠాన్
ABN , Publish Date - Mar 29 , 2026 | 05:17 PM
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ ఓటమిపై టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సందడి మొదలైంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్(80) పోరాడినా జట్టుకు ఓటమి తప్పలేదు. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్ విభాగంలో హైదరాబాద్ జట్టు తేలిపోయింది. ఈ ఓటమిపై టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు పరాజయానికి గల కారణాలను వెల్లడించాడు.
‘ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే ఆటపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు ప్లేయర్లు మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంటుంది. కానీ ఎస్ఆర్‌హెచ్ జట్టు అలా చేయలేకపోయింది. ముఖ్యంగా పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోవడం జట్టు ఓటమి కారణమైంది. డఫీ బౌలింగ్‌లో టాపార్డర్ కుప్పకూలిపోయింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి స్వల్ప వ్యవధిలోనే ఔటవ్వడంతో మిడిలార్డర్ బ్యాటర్లపై ఒత్తిడి పడింది. వారు పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. ఇషాన్ కిషన్ అద్భుతంగానే రాణించాడు. 200 స్కోర్ అయినా దాటగలిగిందంటే అనికేత్ వర్మ, ఇషాన్ పోరాటం వల్లే! కానీ ఆ స్కోర్ కూడా చిన్నస్వామి స్టేడియం పిచ్‌పై సరిపోలేదు’ అని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు.
తేలిపోయారు..
హైదరాబాద్ బౌలింగ్ విభాగంపై పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కీలక దశల్లో నియంత్రణ కోల్పోయారు. కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌కు ఇది మొదటి మ్యాచ్ కావడంతో ఒత్తిడి సహజం. కానీ హైదరాబాద్ బౌలర్లను ఆర్సీబీ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. విజయం సాధించాలంటే ముందుగా పవర్ ప్లేను సమర్థంగా నిర్వహించాలి. బ్యాటింగ్‌లో అయినా, బౌలింగ్‌లోనైనా పవర్ ప్లేనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తుంది. ఆ ఆరు ఓవర్లు అత్యంత కీలకం. అదే జట్టు విజయానికి మార్గం’ అని పఠాన్ సూచించాడు. ఇదిలా ఉండగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ చరిత్రలోనే తొలి బ్యాటర్‌గా.. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 2026: నేడు ముంబైతో మ్యాచ్.. భయంలో కేకేఆర్!