ఐపీఎల్ 2028: గంభీర్ కోసం నాలుగు ఫ్రాంచైజీల పోటీ.. కోచ్‌గా చేరాలంటూ..!
ABN , Publish Date - Oct 30 , 2026 | 02:11 PM
ఐపీఎల్ 2028లో టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‌ను మెంటార్ లేదా కోచ్‌గా నియమించుకునేందుకు నాలుగు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి భారీ డిమాండ్లు ఏర్పడినట్లు తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు భారత జట్టు ప్రధాన కోచ్‌గా గంభీర్ కొనసాగాల్సి ఉంది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ వరకు పదవీకాలాన్ని పొడగించే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో 2028 ఐపీఎల్ సీజన్ కోసం పలు ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి. గంభీర్‌ను మెంటార్ లేదా కోచ్‌గా నియమించుకునేందుకు ఏకంగా నాలుగు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఓ ఫ్రాంచైజీతో గంభీర్ వర్గం ప్రాథమికంగా చర్చలు కూడా జరిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు ఐపీఎల్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్.. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అంతకుముందు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ), కేకేఆర్ జట్లకు మెంటార్‌గా వ్యవహరించాడు. అయితే 2028 ఐపీఎల్ సీజన్ కోసం నాలుగు ఫ్రాంచైజీలు గంభీర్‌ను తమ జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనం వెలువడింది. కేకేఆర్ కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. మరోవైపు గంభీర్ బృందానికి చెందిన ప్రతినిధులు రాజస్థాన్ రాయల్స్‌తో ప్రాథమిక చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక మరో రెండు ఫ్రాంచైజీలు కూడా గంభీర్‌ను కోచ్‌గా లేదా మెంటార్‌గా నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక పేర్కొంది. వీటిలో ఒకటి ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి కాగా.. మరొక జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదని వెల్లడించింది.
ఐపీఎల్‌లో గంభీర్‌కు ఘనమైన ట్రాక్ రికార్డు
ఐపీఎల్‌లో గంభీర్‌కు మంచి రికార్డు ఉంది. 2022, 2023 సీజన్లలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించాడు. కొత్త జట్టుగా బరిలోకి దిగిన లఖ్‌నవూను వరుసగా రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు తిరిగి కేకేఆర్‌కు మెంటార్‌గా వెళ్లాడు. గంభీర్ వ్యూహాలు, మార్గదర్శకత్వంలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ 2024లో ఐపీఎల్ టైటిల్ గెలిచి పదేళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈ నేపథ్యంలో 2028 ఐపీఎల్ నాటికి గంభీర్ టీమిండియా కోచ్‌గా కొనసాగుతాడా? లేక తిరిగి ఐపీఎల్‌లోకి వస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి:
హాంకాంగ్ సిక్సెస్: భారత్ చిత్తు.. పాకిస్థాన్ ఘన విజయం
కాలుష్య రహిత దీపావళి.. కోహ్లీతో ప్రచారం చేయించండి: సుప్రీంకోర్టు