ఆసియా కప్: పాకిస్థాన్‌తో హ్యాండ్ షేక్ వివాదం.. కోచ్ అమోల్ ఏమన్నారంటే?
ABN , Publish Date - Aug 30 , 2026 | 08:12 AM
మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో తలపడే సమయంలో భారత జట్టు హ్యాండ్ షేక్ ఇస్తుందా? అనే చర్చ మొదలైంది. ఈ ప్రశ్నకు టీమిండియా హెడ్ కోచ్ అమోల్ మజుందార్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. అందులోనూ ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ‘నో హ్యాండ్‌షేక్’ విధానం నేపథ్యంలో.. మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో తలపడే సమయంలో భారత జట్టు చేతులు కలుపుతుందా? అనే చర్చ మొదలైంది. ఈ ప్రశ్నకు టీమిండియా హెడ్ కోచ్ అమోల్ మజుందార్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆ అంశంపై దృష్టి పెట్టడం లేదని.. ఒక్కో మ్యాచ్‌పైనే ఫోకస్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆదివారం థాయ్‌లాండ్ జట్టుతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అమోల్ పాల్గొన్నారు.
‘మైదానంలో అత్యుత్తమ క్రికెట్ ఆడటంపైనే మా దృష్టి ఉంది. మైదానం బయట జరిగే విషయాల గురించి మేం ఆలోచించడం లేదు. ఆ రోజు మాకు తెలిసిన అత్యుత్తమ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాం. పాకిస్థాన్‌తో మ్యాచ్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌పైనే మా దృష్టంతా ఉంది. ఒక్కో మ్యాచ్‌ను ఒక్కో దశగా తీసుకుంటాం’ అని కోచ్ వెల్లడించారు. మహిళల ఆసియా కప్‌లో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. ఇప్పటికే ఏడుసార్లు టైటిల్ గెలిచిన టీమిండియా.. యూఏఈలో ఎనిమిదోసారి ట్రోఫీ సాధించడమే లక్ష్యమా? అని ప్రశ్నించగా మజుందార్ మరోసారి ‘ఒక్కో మ్యాచ్’ సిద్ధాంతాన్నే ప్రస్తావించారు. ‘నేను మరీ ముందుకు వెళ్లి ఆలోచించదల్చుకోలేదు. ఒక్కో మ్యాచ్‌గానే ముందుకెళ్తాం. దానికి తగ్గట్లు ప్రణాళికలు వేసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. నేటి మ్యాచ్ అనంతరం సెప్టెంబర్ 3న హాంకాంగ్‌తో, సెప్టెంబర్ 5న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
వరుసగా ‘నో హ్యాండ్‌షేక్’
2025 పురుషుల ఆసియా కప్ నుంచి పాకిస్థాన్‌తో మ్యాచ్‌ల సందర్భంగా భారత క్రికెట్ జట్లు హ్యాండ్‌షేక్‌లకు దూరంగా ఉంటున్నాయి. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు.. పాకిస్థాన్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ, ఫైనల్‌తో సహా, చేతులు కలపలేదు. ఆ తర్వాత సీనియర్, మహిళల, వయో విభాగాల క్రికెట్‌లోనూ ఇదే విధానం కొనసాగింది. 2025 అక్టోబర్‌లో కొలంబోలో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ భారత జట్టు హ్యాండ్‌షేక్ చేయలేదు. అండర్ 19, ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్ వంటి టోర్నీల్లో కూడా పాకిస్థాన్ జట్టుతో భారత్ హ్యాండ్ షేక్ ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి:
టీమిండియా మ్యాచ్‌లకు టైటిల్ స్పాన్సర్ కరవు.. కారణం ఇదేనా!
51 ఏళ్ల వయసులో ‘ఫైఫర్’.. 94 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మహిళా క్రికెటర్!