ఏడాదిలో 110 సిక్సర్లు.. టీ20ల్లో భారత మహిళల ప్రపంచ రికార్డు
ABN , Publish Date - Sep 23 , 2026 | 02:36 PM
భారత మహిళా క్రికెట్ జట్టు టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో వందకు పైగా సిక్సర్లు బాదిన తొలి టీమ్‌గా చరిత్ర సృష్టించింది. హర్మన్ సేన ఈ ఏడాది ఇప్పటికే 110 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా క్రికెట్ జట్టు అరుదైన ఘనత సాధించింది. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో వందకు పైగా సిక్సర్లు బాదిన తొలి టీమ్‌గా చరిత్ర సృష్టించింది. హర్మన్ సేన ఈ ఏడాది ఇప్పటికే 110 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తాజాగా టీమిండియా ఆసియా క్రీడల్లో శ్రీలంకపై విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో స్మృతి మంధాన(79; 45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు), రిచా ఘోష్(49; 22 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), షఫాలీ వర్మ(48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశారు. మొత్తంగా భారత్ తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 సిక్సర్లు బాదింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో భారత జట్టు కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే కావడం విశేషం. ఇంతకుముందు ఒక క్యాలెండర్ ఏడాదిలో భారత్ మూడుసార్లు 50కిపైగా సిక్సర్లు సాధించింది. అయితే ఏ ఏడాదిలోనూ 70 మార్కును దాటలేదు. తాజా ప్రదర్శనతో ఆ రికార్డులన్నింటినీ అధిగమించింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా 77 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ 63 సిక్సర్లతో తర్వాతి స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా, ఆసియా క్రీడల్లో గోల్డ్ సాధించడంతో పాటు టీ20ల్లో 200 విజయాలు సాధించిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం.. భారత మహిళా జట్టుకు మోదీ అభినందనలు
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వీడ్కోలు