Share News

సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్

ABN , Publish Date - Sep 22 , 2026 | 09:20 PM

ఇంగ్లండ్‌ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.

సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్
Joe Root

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఈ ఘనతను అందుకున్న రూట్.. ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.


23 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసేందుకు రూట్‌కు మ్యాచ్‌ ఆరంభంలో కేవలం మూడు పరుగులే అవసరమయ్యాయి. అద్భుతమైన ఫ్లిక్ షాట్‌తో బౌండరీ బాదిన అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. రూట్ 521వ అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో 23 వేల పరుగులు పూర్తి చేశాడు. సచిన్ 522 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. విరాట్ కోహ్లీ కేవలం 490 ఇన్నింగ్స్‌ల్లోనే 23 వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.


అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగులు సాధించిన ఎనిమిదో బ్యాటర్‌గా రూట్ నిలిచాడు. ఇంగ్లండ్‌ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్‌ కలిస్ ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నారు.


సచిన్‌ రికార్డులపై రూట్‌ కన్ను..

టెస్టు క్రికెట్‌లో ఇప్పటికే సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న పలు రికార్డులను రూట్‌ అధిగమించాడు. ఇటీవల టెస్టుల్లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన సచిన్‌ రికార్డును కూడా రూట్ బద్దలు కొట్టాడు. ఇక టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన సచిన్‌ రికార్డుపైనా రూట్‌ కన్నేశాడు. ప్రస్తుతం సచిన్‌ 15,921 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రూట్‌ 14,278 పరుగులతో ఉన్నాడు. ఇద్దరి మధ్య 1,643 పరుగుల తేడా ఉంది.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం.. భారత మహిళా జట్టుకు మోదీ అభినందనలు

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వీడ్కోలు

Updated Date - Sep 22 , 2026 | 09:20 PM