Share News

ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం.. భారత మహిళా జట్టుకు మోదీ అభినందనలు

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:23 PM

ఆసియా క్రీడలు 2026లో తొలి స్వర్ణం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా 147 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం.. భారత మహిళా జట్టుకు మోదీ అభినందనలు
Narendra Modi

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో తొలి స్వర్ణం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా 147 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి.. పసిడి పతకాన్ని నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రధాని మోదీ అమ్మాయిలను ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.


‘భారత క్రికెట్‌కు ఇది అద్భుత విజయం. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మన అమ్మాయిలకు హృదయపూర్వక అభినందనలు. ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, అద్భుతమైన సమష్టి ప్రదర్శనతో టీమిండియా అదరగొట్టింది. దేశానికి తొలి బంగారు పతకం అందించింది. దేశం గర్వించేలా చేయడమే కాదు.. యువ క్రికెటర్లకు మన అమ్మాయిలు స్ఫూర్తిగా నిలిచారు. ఆసియా క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన సుచిక తరియల్‌కు అభినందనలు’ అని మోదీ పేర్కొన్నారు.


ఇది చారిత్రక విజయం: ఏపీ సీఎం

భారత మహిళా క్రికెట్ జట్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రశంసించారు. ‘స్వర్ణ పతకం సాధించిన టీమిండియా అమ్మాయిలకు శుభాకాంక్షలు. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా మన తెలుగమ్మాయి, కడపకు చెందిన శ్రీచరణికి ప్రత్యేక అభినందనలు. ఆమె తన ప్రతిభతో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధాన, షఫాలీ వర్మతో పాటు జట్టు మొత్తానికీ నా హృదయపూర్వక అభినందనలు’ అని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు.


టీమిండియాకు శుభాకాంక్షలు: సచిన్

‘ఇది కదా క్రికెట్ అంటే! భిన్నమైన ప్లేయర్లు, భిన్నమైన క్షణాలు.. చివరకి గొప్ప ఫలితం. షఫాలీ వర్మ-స్మృతి మంధాన 99 పరుగుల భాగస్వామ్యమే భారత జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చింది. ఆఖరిలో రిచా ఘోష్ దూకుడైన గేమ్‌తో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగాం. షఫాలీ, దీప్తి, శ్రేయాంక, శ్రీచరణి దెబ్బకు శ్రీలంక కుప్పకూలింది. జట్టుగా విజయం సాధించిన టీమిండియాకు శుభాకాంక్షలు’ అని సచిన్ టెండూల్కర్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.


ఇవి కూడా చదవండి:

స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. తొలి మహిళా క్రికెటర్‌గా..

జపాన్‌తో చారిత్రక టీ20లో టీమిండియాదే విజయం

Updated Date - Sep 22 , 2026 | 05:36 PM