‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ
ABN , Publish Date - Nov 13 , 2026 | 09:28 PM
భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, దక్షిణాఫ్రికా ప్లేయర్ మార్కో యాన్సెన్ అరుదైన ఘనత సాధించారు. అక్టోబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను సొంతం చేసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, దక్షిణాఫ్రికా ప్లేయర్ మార్కో యాన్సెన్ అరుదైన ఘనత సాధించారు. అక్టోబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు పురుషుల విభాగంలో యాన్సెన్, మహిళల విభాగంలో దీప్తిని ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు ఐసీసీ ప్రకటించింది.
భారత మహిళా జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అక్టోబర్ నెలలో అద్భుతంగా రాణించింది. జింబాబ్వేతో స్వదేశంలో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటింది. ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన వన్డే సిరీస్‌లో తనకు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన ఏకైక ఇన్నింగ్స్‌లోనే అజేయంగా 106 పరుగులు చేసింది. బౌలింగ్‌లోనూ ఐదు వికెట్లు పడగొట్టింది. టీ20 సిరీస్‌లోనూ దీప్తి తన జోరు కొనసాగించింది. ఒకే ఒక్కసారి బ్యాటింగ్‌కు వచ్చిన ఆమె 37 బంతుల్లో 49 పరుగులు చేసింది. ఆఫ్ స్పిన్‌తో రెండు వికెట్లు కూడా తీసింది. దీప్తికి ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రావడం ఇది రెండోసారి. 2023 డిసెంబర్‌లో ఆమె ఈ పురస్కారాన్ని అందుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన శోభనా మొస్తరీ, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అనాబెల్ సదర్లాండ్‌లు ఈ అవార్డు కోసం పోటీ పడగా.. వాళ్లని వెనక్కి నెట్టి దీప్తి అవార్డును సొంతం చేసుకుంది.
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో మార్కో యాన్సెన్ అద్భుత ప్రదర్శన చేశాడు. అక్టోబర్ నెలలో మొత్తం 198 పరుగులు చేయడంతో పాట బౌలింగ్‌లో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో 26 ఏళ్ల యాన్సెన్ ఐసీసీ టెస్టు బౌలింగ్, ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానానికి చేరుకున్నాడు. 2024లో కగిసో రబడా తర్వాత టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని అందుకున్న తొలి దక్షిణాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు. ఈ అవార్డు కోసం పాకిస్థాన్ ఆటగాడు అరాఫత్ మిన్హాస్, వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కూడా పోటీపడ్డారు. ఆఖరి యాన్సెన్‌ను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వరించింది.
ఇవి కూడా చదవండి:
అరుదైన గౌరవం.. హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఆవిష్కరణ
89 పరుగులకే టీమిండియా ఆలౌట్.. బ్యాటర్లపై గంభీర్ తీవ్ర అసంతృప్తి!