Share News

89 పరుగులకే టీమిండియా ఆలౌట్.. బ్యాటర్లపై గంభీర్ తీవ్ర అసంతృప్తి!

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:57 PM

న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో టీమిండియా ఘోర పరాజయంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. భారత బ్యాటర్లు 89 పరుగులకే ఆలౌట్ అవ్వడంపై స్పందించాడు.

89 పరుగులకే టీమిండియా ఆలౌట్.. బ్యాటర్లపై గంభీర్ తీవ్ర అసంతృప్తి!
Gautam Gambhir

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో టీమిండియా ఘోర పరాజయంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. భారత బ్యాటర్లు కేవలం 89 పరుగులకే ఆలౌట్ అవ్వడంపై స్పందించాడు. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ డకౌట్‌గా వెనుదిరగడంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ 6 వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే. అతడు వేసిన బంతులు ఆడలేనివేమీ కాదని.. బ్యాటర్లే వాటిని ఎదుర్కోవడంలో విఫలమయ్యారని గంభీర్ స్పష్టం చేశాడు.


మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన గంభీర్.. హెన్రీ బౌలింగ్‌ను సాకుగా చూపించేందుకు నిరాకరించాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడలేని బంతులంటూ ఏమీ ఉండవు. తొలి పది ఓవర్లను జాగ్రత్తగా ఎదుర్కోవాల్సింది. మ్యాట్ హెన్రీ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. కానీ వాటిని ఎదుర్కొనే సామర్థ్యం మన బ్యాటర్లకు ఉండాలి. 89 పరుగులకే ఆలౌట్ అయితే ఆందోళన చెందకుండా ఎలా ఉంటాం? ఇవి ప్రపంచకప్‌లో ఎదురయ్యే పరిస్థితులకు దగ్గరగా ఉండే పిచ్‌లు. గత మ్యాచ్‌లోనూ ఏడు వికెట్లు కోల్పోయాం. ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. రెండో వన్డేలోనూ 111 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయాం. ఇది కొంత ఆందోళన కలిగిస్తోంది. మానసికంగా, నైపుణ్యపరంగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో 35-40 పరుగులకు వికెట్ కోల్పోకుండా ఉండటం కూడా మంచి ఆరంభమే. మనకు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. చివరి మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్టుగా ఆడతారని ఆశిస్తున్నా’ అని గంభీర్ పేర్కొన్నాడు.


బౌలర్లపై ప్రశంసలు..

‘ఆకిబ్ నబీ దురదృష్టవశాత్తూ విల్ యంగ్ వికెట్‌ను తీయలేకపోయాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచించడం వల్ల ప్రయోజనం లేదు. మనం క్యాచ్‌లు వదిలేశాం. దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మన బౌలింగ్ విభాగం పట్ల ప్రతి ఒక్కరూ గర్వపడాలి. నేను సాంకేతిక అంశాల్లోకి వెళ్లదలచుకోలేదు. బంతి పెద్దగా పక్కకు కదలలేదు. బంతి కదలికను ఎదుర్కోవడం బ్యాటర్ బాధ్యత. సీమ్ కంటే బౌలర్లు బంతులు వేసిన ప్రాంతాలు, లెంగ్త్‌లే మనకు సమస్యలు సృష్టించాయి. కివీస్ బౌలర్లు సంధించిన బంతులకు బ్యాటర్లు క్రీజులోనే ఉండిపోయారు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.


ఇవి కూడా చదవండి:

సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ!

న్యూజిలాండ్‌దే నాలుగో వన్డే.. టీమిండియా ఘోర ఓటమి

Updated Date - Nov 13 , 2026 | 03:58 PM