Share News

Ind vs NZ: షాకింగ్.. టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం

ABN , Publish Date - Jan 15 , 2026 | 10:21 AM

జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కివీస్‌తో తొలి వన్డేలో వాషీ గాయపడిన సంగతి తెలిసిందే.

Ind vs NZ: షాకింగ్.. టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం
Ind vs NZ

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గాయంతో ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమైన భారత స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్.. రానున్న టీ20 సిరీస్‌ నుంచి కూడా తప్పుకున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ(BCCI) తెలిపింది. జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా ఐదు టీ20ల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. కాగా ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న టీ0 ప్రపంచ కప్ ముంగిట ఈ వార్త ఆందోళన కలిగించేదే!


వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్నప్పుడు సుందర్(Washington Sundar) పక్కటెముకల కండరాలకు గాయం అయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచులో కేవలం 5 ఓవర్లు మాత్రమే వేసిన వాషీ.. తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడాడు. బ్యాటింగ్‌కి కూడా వస్తాడా? లేడా? అన్న సందేహాల నడుమ జట్టు గెలుపు కోసం క్రీజులోకి వచ్చాడు. నొప్పితో విలవిల్లాడుతూనే పరుగులు చేశాడు. వికెట్ల మధ్య పరిగెత్తడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే తాజాగా వచ్చిన స్కానింగ్ రిపోర్ట్‌ల ప్రకారం గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో రానున్న టీ20 సిరీస్‌కు దూరమవ్వాల్సి వచ్చిందని బీసీసీఐ పేర్కొంది.


జట్టును వేధిస్తోన్న గాయాల బెడద..

టీమిండియాను ఆటగాళ్ల గాయాలు వేధిస్తున్నాయి. కీలక ఆటగాళ్లు గాయాల పాలవుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. రానున్న టీ20 ప్రపంచ కప్ 2026 కోసం టీమిండియా సిద్ధమవుతున్న వేళ.. సుందర్ దూరమవ్వడం జట్టు కూర్పుపై ప్రభావం పడనుంది. ఇప్పటికే స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడి.. వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. యువ బ్యాటర్ తిలక్ వర్మకు సర్జరీ అవ్వడంతో.. అతడూ ఆడటం కష్టమే. ఇలా ఒక్కొక్కరుగా స్టార్ ప్లేయర్లు గాయాల పాలవుతుండటంతో.. బలమైన న్యూజిలాండ్ జట్టును టీమిండియా ఎలా ఎదుర్కోనుందనే దానిపై చర్చ మొదలైంది.


ఇవి కూడా చదవండి:

11 ఏళ్ల రికార్డు.. చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్!

ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: శుభ్‌మన్ గిల్

Updated Date - Jan 15 , 2026 | 10:55 AM