ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో ఇషాన్ కిషన్
ABN , Publish Date - Jul 01 , 2026 | 03:19 PM
టీ20 ర్యాంకింగ్స్ జాబితాను తాజాగా ఐసీసీ విడుదల చేసింది. ఇందులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ 876 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ర్యాంకింగ్స్ జాబితాను తాజాగా ఐసీసీ విడుదల చేసింది. ఇందులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ 876 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. కొంతకాలంగా టాప్‌లో కొనసాగుతున్న విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ(869) రెండో స్థానానికి పడిపోయాడు. అయితే వీరిద్దరూ మధ్య ఏడు రేటింగ్ పాయింట్ల తేడానే ఉండటం గమనార్హం.
టీ20 ప్రపంచ కప్ 2026లో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. టోర్నీలో పాకిస్థాన్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అతడిని ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా చేయడానికి ఆ ఇన్నింగ్స్ ప్రధాన కారణం. కాగా టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ ఈ ఘనత సాధించారు.
ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్ ప్లేయర్లు..
భారత్‌పై ఐర్లాండ్ చారిత్రక విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్ ప్లేయర్లకు మంచి ఫలితం కనిపించింది. లార్కన్ టక్కర్ నాలుగు స్థానాలు ఎగబాకి 77వ స్థానానికి చేరుకోగా.. రాస్ అడైర్ ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 84వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో ఐర్లాండ్ పేసర్ మాథ్యూ హంఫ్రీస్ రెండు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ 25వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే మూడు స్థానాలు ఎగబాకి టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. ఐర్లాండ్‌కు చెందిన గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్ వరుసగా 24, 38వ స్థానాలకు చేరుకున్నారు.
టెస్టుల్లో ట్రావిస్ హెడ్‌కు అగ్రస్థానం

ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కూడా కీలక మార్పులు చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ తొలిసారి ప్రపంచ నంబర్ వన్ టెస్టు బ్యాటర్‌గా అవతరించాడు. న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్, జో రూట్ ఆశించిన స్థాయిలో రాణించని సంగతి తెలిసిందే. దీంతో బ్రూక్ రెండు, రూట్ మూడో స్థానానికి పడిపోయారు. న్యూజిలాండ్ ప్లేయర్లు రచిన్ రవీంద్ర ఏడో స్థానానికి, డారిల్ మిచెల్ 11వ స్థానానికి, డెవాన్ కాన్వే 14 స్థానాలు ఎగబాకి సంయుక్తంగా 15వ స్థానానికి, టామ్ లాథమ్ సంయుక్తంగా 31వ స్థానానికి చేరుకున్నారు. టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా అవతరించాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీని అధిగమించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన శ్రేయస్
40 ఏళ్ల నాకౌట్ శాపానికి తెర.. ఈక్వెడార్‌ను చిత్తు చేసిన మెక్సికో