ఖరీదైన ఉంగరం ధరించి అందరినీ ఆకర్షించిన సెరెనా విలియమ్స్!
ABN , Publish Date - Jul 01 , 2026 | 02:30 PM
టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ప్రొఫెషనల్ సింగిల్స్ కోర్టులోకి ఘనంగా పునరాగమనం చేశారు. సెంటర్ కోర్టులో జరిగిన రౌండ్-1 ఉత్కంఠభరిత పోరులో ఈ అమెరికా స్టార్ ఓటమిపాలైంది.
స్పోర్ట్స్ డెస్క్: టెన్నిస్ దిగ్గజం, 44 ఏళ్ల సెరెనా విలియమ్స్ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ప్రొఫెషనల్ సింగిల్స్ కోర్టులోకి ఘనంగా పునరాగమనం చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్-2026 ద్వారా కోర్టులోకి ఎంట్రీ ఇచ్చారు. సెంటర్ కోర్టులో జరిగిన రౌండ్-1 ఉత్కంఠభరిత పోరులో ఈ అమెరికా స్టార్ ఓటమిపాలైనప్పటికీ.. తన ఆటతోనే కాకుండా స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. 2 గంటల 22 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సెరెనా ధరించిన ఖరీదైన రింగ్, వాచ్ అందరినీ ఆకర్షించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ధరించిన ఈ ఖరీదైన వస్తువులపైనే చర్చ నడుస్తోంది.
ఈ మ్యాచ్‌లో సెరెనా చేతికి ఉన్న డైమండ్ రింగ్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. తన భర్త, రెడ్డిట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్ ఇచ్చిన ఈ నిశ్చితార్థపు ఉంగరం విలువ సుమారు 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 కోట్లు) ఉంటుందని అంచనా. ఇందులో 17 క్యారెట్ల ఓవల్-కట్ వైట్ డైమండ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో పాటు ఆమె ప్రత్యేకంగా చేయించుకున్న నెయిల్ మానిక్యూర్ (గ్లేజ్డ్ క్రోమ్ ట్రెండ్) ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసింది. మరోవైపు ఆమె మణికట్టుకు ఉన్న ఖరీదైన డైమండ్ వాచ్ కూడా ప్రత్యేకంగా నిలిచింది.
స్విస్ వాచ్ మేకర్ ఆడెమర్స్ పిగ్యుట్ రూపొందించిన 'రాయల్ ఓక్ ఆఫ్‌షోర్ సెల్ఫ్ వైండింగ్ క్రోనోగ్రాఫ్' వాచ్‌ను ఈ అమెరికా స్టార్ ధరించారు. వైట్ గోల్డ్‌తో తయారై, పింక్ యాక్సెంట్స్, 32 బ్రిల్లియంట్ కట్ వజ్రాలతో మెరిసిపోతున్న ఈ వాచ్.. వింబుల్డన్ సాంప్రదాయ తెల్ల దుస్తులకు సరిగ్గా సరిపోయింది. సెంటర్ కోర్టులో డేవిడ్ బెక్హాం, రోమియో బెక్హాం (పాటెక్ ఫిలిప్) వంటి ప్రముఖులు లగ్జరీ వాచ్‌లతో కనిపించినప్పటికీ.. సెరెనా ధరించిన వాచ్ వాటన్నింటికంటే ప్రత్యేకంగా నిలిచి ఫ్యాషన్‌పై ఆమెకు ఉన్న మక్కువను చాటిచెప్పింది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన శ్రేయస్
40 ఏళ్ల నాకౌట్ శాపానికి తెర.. ఈక్వెడార్‌ను చిత్తు చేసిన మెక్సికో