ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ
ABN , Publish Date - May 06 , 2026 | 06:30 PM
టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ.. 875 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ.. 875 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే మరో స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రెండో స్థానానికి ఎగబాకాడు. దేశవాళీల్లో సత్తా చాటి టీమిండియాలో అవకాశం దక్కించుకున్న ఇషాన్.. అద్భుత ప్రదర్శనలు చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. 871 పాయింట్లతో ఇషాన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే అభిషేక్ కంటే కేవలం 4 పాయింట్ల తేడాతోనే ఉండటం విశేషం.
పాకిస్థాన్ బ్యాటర్ ఫర్హాన్(848), ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్(792) మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. అయితే టాప్ 8 స్థానాల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. శ్రీలంక బ్యాటర్ నిశాంక(766), టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ(742), సూర్యకుమార్ యాదవ్(722), బట్లర్(716) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో బంగ్లా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారు ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాలకు చేరుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన తౌహిద్ హృదయ్ రెండు స్థానాలు ఎగబాకి 37వ ర్యాంక్‌కు చేరాడు. బంగ్లా జట్టు కెప్టెన్ లిట్టన్ దాస్ కూడా ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు.
బౌలింగ్ విభాగంలో..
ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో బౌలింగ్ విభాగంలో టాప్ 11 స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ 753 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుణ్ చక్రవర్తి(740), అబ్రార్ అహ్మద్(736), ఆదిల్ రషీద్(721), బుమ్రా(702) కొనసాగుతున్నారు. బంగ్లా బౌలర్ మహెది హసన్ 17వ స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్ బౌలర్ బెన్ సీర్స్ పది స్థానాలు మెరుగుపర్చుకుని 51వ స్థానానికి చేరుకున్నాడు. ఇష్ సోథీ నాలుగు స్థానాలు ఎగబాకి 88వ స్థానానికి చేరాడు.
ఇవి కూడా చదవండి:
సంజు శాంసన్ మా జట్టుకు వెన్నుముక: రుతురాజ్
భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం!