ఐపీఎల్ మధ్యలో విషాదం: పంజాబ్ కింగ్స్ మాజీ ప్లేయర్ మృతి
ABN , Publish Date - May 06 , 2026 | 05:25 PM
క్రీడా రంగంలో విషాదం చోటుచేసుకుంది. పంజాబ్ మాజీ ఆటగాడు, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అండర్-19 జట్టు సహచరుడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ ఆకస్మికంగా మృతిచెందారు.
స్పోర్ట్స్ డెస్క్: క్రీడా రంగంలో విషాదం చోటుచేసుకుంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (పంజాబ్ కింగ్స్) మాజీ ఆటగాడు, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అండర్-19 జట్టు సహచరుడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ ఆకస్మికంగా మృతిచెందారు. 37 ఏళ్ల గిల్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో గిల్ మరణవార్త వెలుగులోకి వచ్చింది.
చండీగఢ్‌లో జన్మించిన అమన్‌ప్రీత్ సింగ్ గిల్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాక విరాట్ కోహ్లీతో కలిసి 2007లో అండర్-19 ప్రపంచకప్‌లో ఆడారు. ఆ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి మంచి ప్రతిభ చాటారు. అలాగే ఐపీఎల్ ప్రారంభంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్(ప్రస్తుత పంజాబ్ కింగ్స్) జట్టులో భాగంగా ఉన్నారు. క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా అమన్‌ప్రీత్ సింగ్ సేవలందించారు.
అమన్‌ప్రీత్ మృతిపై పంజాబ్ క్రికెట్ అసోసిచయేషన్ సంతాపం వ్యక్తం చేసింది. పంజాబ్ క్రికెట్‌కు అంకితభావంతో సేవలందించిన అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మరణం చాలా బాధాకరమని పేర్కొంది. అమన్‌ప్రీత్ అంత్యక్రియలు ఇవాళ (బుధవారం) సాయంత్రం 4:00 గంటలకు చండీగఢ్‌లోని మణిమజ్రా శ్మశానవాటికలో నిర్వహించారు. అమన్‌ప్రీత్ గిల్ మృతికి సంతాపంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్లు ధరించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
ట్రావిస్, అభిషేక్‌లకు బౌలింగ్ చేయాలంటే ఆ స్టార్ బౌలర్‌కు భయం!
సంజు శాంసన్ మా జట్టుకు వెన్నుముక: రుతురాజ్