ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే కొనసాగుతున్న అభిషేక్ శర్మ
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:22 PM
ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ ఆరంభం నాటి విఫలమవుతూ వస్తున్నప్పటికీ.. టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ 874 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమరం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే సూపర్ 8 నుంచి నాలుగు జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ ఆరంభం నాటి విఫలమవుతూ వస్తున్నప్పటికీ.. టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ 874 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.
జింబాబ్వేపై హాఫ్ సెంచరీ మినహా అభిషేక్ ఈ టోర్నీలో పరుగులు రాబట్టలేకపోయాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగి వరుసగా మూడు డకౌట్లు, ఓ మ్యాచ్‌లో 15 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. కాగా పాకిస్థాన్ బ్యాటర్ ఫర్హాన్ ఈ టోర్నీలో రెండు సెంచరీలు చేసి 848 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకొచ్చాడు. అభిషేక్ శర్మ ఫామ్ అందుకుని పరుగులు చేయలేకపోతే.. తన స్థానాన్ని కోల్పోవడం ఖాయమే. కాగా పొట్టి ప్రపంచ కప్ టోర్నీలో అద్భుత ప్రదర్శనలు చేసిన ఇషాన్ కిషన్(783).. 15వ స్థానం నుంచి ఒకేసారి నాలుగో స్థానానికి దూసుకొచ్చాడు. తిలక్ వర్మ(749), కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(739) ఐదు, ఆరో స్థానాల్లో కొనసాగుతున్నారు.
బౌలింగ్ విభాగంలో..
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ బౌలింగ్ జాబితాలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 771 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని పదిలపర్చుకున్నాడు. ప్రపంచ కప్ ఆఖరి రెండు మ్యాచుల్లో కాస్త పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. వికెట్లు తీసుకున్నాడు. దీంతో తన స్థానం పదిలంగా ఉంది. రెండో స్థానంలో అఫ్గానిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ 753 పాయింట్లతో ఉన్నాడు. పాకిస్థాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్(736) మూడో స్థానానికి దూసుకొచ్చాడు. బుమ్రా(671) ఏడో స్థానంలో ఉండగా.. అర్ష్‌దీప్ సింగ్(653) 13వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఆల్‌రౌండర్ జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా(328) అగ్రస్థానంలో ఉన్నాడు. టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్య 284 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ వ్యూయర్ షిప్‌లో సంచలన రికార్డ్!
ఐపీఎల్ 2026: చిన్నస్వామి స్టేడియంలోనే ఫైనల్ పోరు