Share News

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: ప్రపంచ నం.1కు అడుగు దూరంలో గిల్

ABN , Publish Date - Jul 15 , 2026 | 04:40 PM

వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇంగ్లండ్‌పై తొలి వన్డేలో 80 పరుగులు చేసిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ ర్యాంకింగ్స్‌లో భారీ లాభం పొందాడు. 12 రేటింగ్ పాయింట్లు పెంచుకుని గిల్(803)లో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: ప్రపంచ నం.1కు అడుగు దూరంలో గిల్
ICC ODI Rankings

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇంగ్లండ్‌పై తొలి వన్డేలో 80 పరుగులు చేసిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ ర్యాంకింగ్స్‌లో భారీ లాభం పొందాడు. 12 రేటింగ్ పాయింట్లు పెంచుకుని గిల్(803) ఈ జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ప్రపంచ నంబర్ 1 స్థానానికి అడుగు దూరంలో నిలిచాడు. ప్రస్తుతం ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్(814) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి కంటే గిల్ కేవలం 11 పాయింట్ల తేడాతో మాత్రమే వెనుకబడి ఉన్నాడు. టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మూడు, నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నారు.


బుమ్రా ర్యాంక్ మెరుగుదల

దాదాపు 968 రోజుల తర్వాత వన్డేల్లోకి తిరిగొచ్చిన భారత పేస్‌గుర్రం జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్‌లోనే ప్రభావం చూపించాడు. ఇంగ్లండ్‌పై 1/31 గణాంకాలు నమోదు చేసిన బుమ్రా.. ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 24వ స్థానానికి చేరుకున్నాడు. తొలి వన్డేలో నాలుగు వికెట్లు తీసి, అజేయ అర్ధ శతకంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’‌గా నిలిచిన అక్షర్ పటేల్‌కు కూడా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారీ లాభం చేకూరింది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అతడు ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 73వ స్థానానికి చేరుకున్నాడు. బౌలింగ్‌లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 42వ స్థానంలో నిలిచాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్-10లోకి ప్రవేశించి 9వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. అజేయ అర్ధ శతకం సాధించిన వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్‌లో 24 స్థానాలు ఎగబాకి 177వ స్థానానికి చేరుకోగా.. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో 16 స్థానాలు మెరుగుపరుచుకుని 55వ ర్యాంక్‌లో నిలిచాడు.


టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్ల జోరు

భారత్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్ ప్లేయర్లు టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ 12 స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌కు చేరుకోగా.. జోస్ బట్లర్ ఆరో స్థానానికి చేరుకున్నాడు. పేసర్ జోఫ్రా ఆర్చర్ ఎనిమిది స్థానాలు మెరుగుపరుచుకుని సంయుక్తంగా 18వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

అర్జెంటీనాను తొలగించాలని.. 75 లక్షల మంది సంతకాలతో పిటిషన్!

జపాన్ ఓపెన్ టోర్నీ: భారత్‌కు షాక్.. లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి ఔట్

Updated Date - Jul 15 , 2026 | 04:40 PM