Share News

జపాన్ ఓపెన్ టోర్నీ: భారత్‌కు షాక్.. లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి ఔట్

ABN , Publish Date - Jul 15 , 2026 | 01:55 PM

జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్లకు నిరాశ తప్పలేదు. ప్రతిష్ఠాత్మక టోర్నీ తొలి రౌండ్‌లోనే స్టార్ షట్లర్లు లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి ఓటమి చవి చూసి టోర్నీ నుంచి నిష్క్రమించారు.

జపాన్ ఓపెన్ టోర్నీ: భారత్‌కు షాక్.. లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి ఔట్
Japan Open Badminton

ఇంటర్నెట్ డెస్క్: జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్లకు నిరాశ తప్పలేదు. ప్రతిష్ఠాత్మక టోర్నీ తొలి రౌండ్‌లోనే స్టార్ షట్లర్లు లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి ఓటమి చవి చూసి టోర్నీ నుంచి నిష్క్రమించారు. వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ముందు కీలక సన్నాహక టోర్నీగా భావిస్తున్న ఈ పోటీలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. ఇప్పటికే పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ గాయంతో మ్యాచ్ మధ్యలోనే తప్పుకుంది. సాత్విక్ భుజం గాయంతో బాధపడటంతో తొలి రౌండ్ మ్యాచ్‌ను కొనసాగించలేకపోయారు. ఆ తర్వాత సింగిల్స్‌లోనూ భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు ఓటమి చవి చూడటం ఆందోళన కలిగిస్తోంది.


వతనాబే చేతిలో లక్ష్య సేన్..

జపాన్‌కు చెందిన కోకి వతనాబే చేతిలో లక్ష్య సేన్ వరుస గేముల్లో ఓడిపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న లక్ష్యకు.. 17వ ర్యాంకర్ వతనాబే ఏ మాత్రం గెలిచే అవకాశం ఇవ్వలేదు. ఆరంభ గేమ్‌లో కొంతవరకు పోటీ ఇచ్చిన లక్ష్య.. కీలక దశలో వెనుకబడ్డాడు. రెండో గేమ్‌లో వతనాబే మరింత దూకుడుగా ఆడాడు. శక్తివంతమైన స్మాష్‌లతో లక్ష్యను ఒత్తిడిలోకి నెట్టాడు. కేవలం 38 నిమిషాల్లోనే 21-16, 21-14 తేడాతో విజయాన్ని అందుకున్నాడు. ఈ సీజన్‌లో లక్ష్య సేన్ నిలకడ కోసం పోరాడుతున్నాడు. మార్చిలో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన అతడు.. మేలో సింగపూర్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లాడు. అనంతరం ఇండోనేషియా ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.


పోరాడి ఓడిన ఆయుశ్ శెట్టి

మరో భారత యువ షట్లర్ ఆయుశ్ శెట్టి.. థాయ్‌లాండ్‌కు చెందిన రెండో సీడ్ కున్లావుట్ విటిడ్సార్న్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడాడు. తొలి గేమ్‌లో హోరాహోరీగా తలపడిన ఆయుశ్.. రెండో గేమ్‌లో ఓటమి అంచు నుంచి తిరిగొచ్చాడు. ప్రత్యర్థి సాధించిన ఐదు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుని గేమ్‌ను గెలుచుకుని నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు. అయితే చివరి గేమ్‌లో అదే దూకుడును కొనసాగించలేకపోయాడు. గంటా 22 నిమిషాల పాటు సాగిన ఉత్కంఠ పోరులో విటిడ్సార్న్ 21-19, 23-25, 21-15 తేడాతో విజయం సాధించాడు.


ఉన్నతి హుడాకు కూడా నిరాశ

మహిళల సింగిల్స్‌లోనూ భారత్‌కు చేదు ఫలితమే ఎదురైంది. ప్రపంచ 24వ ర్యాంకర్ ఉన్నతి హుడా.. చైనీస్ తైపీకి చెందిన ఆటగాళ్ల చేతిలో ఓడిపోయింది. హువాంగ్ యు-హ్సున్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉన్నతి 21-16, 16-21, 15-21 తేడాతో పరాజయం పాలైంది. అయితే స్టార్ షట్లర్ పీవీ సింధు మాత్రం భారత ఆశలను నిలబెట్టింది. ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు తొలి రౌండ్‌లో మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌పై 21-14, 21-11తో సునాయాస విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది.


ఇవి కూడా చదవండి:

నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని గుర్తించింది ఆ ఇద్దరే: వాషింగ్టన్ సుందర్

బీసీసీఐ ఇచ్చిన హామీ నెరవేరలేదు.. ర్యాన్ టెన్ జట్టును వీడటంపై కొత్త ప్రచారం!

Updated Date - Jul 15 , 2026 | 01:55 PM