Share News

ICC-BCB: భారత్ నుంచి మ్యాచ్‌ల తరలింపు వివాదం.. బీసీబీకి ఐసీసీ కీలక సూచన!

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:29 PM

భద్రత కారణాల దృష్ట్యా రానున్న టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌లో బంగ్లా ఆడనున్న మ్యాచ్‌ల వేదికలు మార్చాలంటూ బీసీబీ.. ఐసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. బీసీబీ అభ్యర్థనను ఐసీసీ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఈ అంశంపై ఐసీసీ.. బంగ్లా క్రికెట్ బోర్డుకు ఓ కీలక సూచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ICC-BCB: భారత్ నుంచి మ్యాచ్‌ల తరలింపు వివాదం.. బీసీబీకి ఐసీసీ కీలక సూచన!
ICC-BCB

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి కేకేఆర్ జట్టు రిలీజ్ చేసింది. ఈ పరిణామం తర్వాత బంగ్లా క్రికెట్ బోర్డు, బంగ్లా ప్రభుత్వం ఈ విషయంపై తీవ్రంగా స్పందించాయి. భద్రత కారణాల దృష్ట్యా రానున్న టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌లో బంగ్లా ఆడనున్న మ్యాచ్‌ల వేదికలు మార్చాలంటూ బీసీబీ.. ఐసీసీకి లేఖ రాసింది. తమ మ్యాచులను శ్రీలంకకు తరలించాలని విజ్ఞప్తి చేస్తోంది. అయితే బీసీబీ అభ్యర్థనను ఐసీసీ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఈ అంశంపై ఐసీసీ.. బంగ్లా క్రికెట్ బోర్డు(BCB)కు ఓ కీలక సూచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


షెడ్యూల్ ప్రకారం.. బంగ్లాదేశ్ తన గ్రూప్ మ్యాచులను కోల్‌కతా, ముంబై వేదికగా ఆడాల్సి ఉంది. అయితే వాటిని చెన్నై, తిరువనంతపురంలో ఆడాలని ఐసీసీ.. బీసీబీకి సూచించినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈ విషయాన్ని ఐసీసీ(ICC) ధ్రువీకరించాల్సి ఉంది. కానీ ఈ ప్రతిపాదనలను బీసీబీ తిరస్కరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఏ నిర్ణయమైనా తమ ప్రభుత్వ అనుమతితోనే తీసుకుంటామని.. సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకోమని బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లామ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.


అంపైర్ వివాదం..

ఆదివారం వడోదర వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ అంపైర్‌ సర్ఫుద్దౌలా సైకత్‌ విధులు నిర్వహించాడు. అలాగే టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచుల్లో కూడా సైకత్‌, గాజీ సోహెల్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. బీసీబీ.. భారత్‌లో తమ జట్టు సభ్యుల భద్రతను సాకుగా చూపుతున్న నేపథ్యంలో సైకత్‌ అంపైర్‌గా సాఫీగా విధులు నిర్వహించిన విషయాన్ని ఐసీసీ ప్రస్తావించే అవకాశముంది. అలాగే వరల్డ్‌ కప్‌ ప్రారంభం కావడానికి కేవలం నాలుగు వారాల సమయమే మిగిలి ఉన్నందున ఐసీసీ ఈ అంశంపై త్వరలోనే అధికారికంగా స్పందించే అవకాశం లేకపోలేదు.


ఇవి కూడా చదవండి:

హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన యువ సంచలనం.. ఎవరీ నందని శర్మ?

టీమిండియాకు మరో షాక్.. సిరీస్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ ఔట్!

Updated Date - Jan 12 , 2026 | 12:29 PM