Share News

హర్మన్-స్మృతి మధ్య విభేదాలు? కారణం అదేనా..

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:46 PM

భారత మహిళల క్రికెట్‌లో కెప్టెన్సీ మార్పు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్సీ విషయంలో హర్మన్‌ప్రీత్‌, స్మృతి మధ్య కొంతకాలంగా అభిప్రాయ భేదాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

హర్మన్-స్మృతి మధ్య విభేదాలు? కారణం అదేనా..
Harmanpreet vs Smriti

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల క్రికెట్‌లో కెప్టెన్సీ మార్పు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో స్మృతి మంధానకు ఆ పగ్గాలు అప్పగించారు. అయితే.. ఈ మార్పు మరింత ముందే జరిగి ఉండాల్సిందా? కెప్టెన్సీ విషయంలో హర్మన్‌ప్రీత్‌, స్మృతి మధ్య కొంతకాలంగా అభిప్రాయ భేదాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. డ్రెస్సింగ్ ‌రూమ్‌లోనూ దీని ప్రభావం కనిపించిందని ఓ జట్టు వర్గాన్ని ఉటంకిస్తూ ఓ నివేదిక పేర్కొంది.


గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను గెలిచి భారత్‌ ఐసీసీ టైటిల్‌ కరవుకు తెరదించినప్పటికీ.. కెప్టెన్సీలో ఎలాంటి మార్పు చేయకపోవడంపై స్మృతి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ స్మృతి.. భారత జట్టుకు నాయకత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. అదే సమయంలో వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లలో భారత్‌ లీగ్ దశలోనే నిష్క్రమించడం కూడా హర్మన్‌ప్రీత్‌ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది. అయితే సెలెక్టర్లు మాత్రం కెప్టెన్సీలో మార్పు చేయకుండా కొనసాగించారు.


గువాహటి సమావేశంతో మార్పు

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా నేతృత్వంలో గువాహటిలో జరిగిన సమీక్ష సమావేశంలో హర్మన్‌ప్రీత్‌కు కెప్టెన్సీలో మార్పు తప్పదనే విషయం స్పష్టమైనట్లు ఓ నివేదిక పేర్కొంది. దీంతో చివరకు హర్మన్‌ప్రీత్‌ స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కెప్టెన్సీ అంశం హర్మన్‌ప్రీత్‌, స్మృతి మధ్య కొంతకాలంగా సమస్యగా మారిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి హర్మన్‌ప్రీత్‌, స్మృతి నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు.


గతంలోనూ ఇదే పరిస్థితి..

భారత మహిళల జట్టులో కెప్టెన్సీ మార్పు సమయంలో విభేదాలు తలెత్తడం ఇదే తొలిసారి కాదని తెలుస్తోంది. మిథాలీ రాజ్‌ నుంచి హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన సమయంలోనూ ఈ ఇద్దరు సీనియర్‌ ప్లేయర్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనివల్ల జట్టులో వర్గ పోరు ఏర్పడిందనే చర్చ జరిగింది. ఇప్పుడు హర్మన్‌ప్రీత్‌ మరో మూడేళ్లు జట్టులో ప్లేయర్‌గా కొనసాగాలని భావిస్తున్న నేపథ్యంలో.. కొత్త కెప్టెన్‌ స్మృతి మంధానతో ఆమె ఎలా సమన్వయం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి:

ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ

తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి

Updated Date - Oct 07 , 2026 | 12:46 PM