హార్దిక్ ట్రేడ్ డీల్: ఆ ప్లేయర్ లేకపోతే ఎంఐ ఒప్పుకోదు.. సీఎస్కేకి అశ్విన్ హెచ్చరిక
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:31 PM
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2027కు ముందు ట్రేడ్ డీల్‌లో భాగంగా సీఎస్కే హార్దిక్‌ను దక్కించుకోవాలంటే ముంబై ఇండియన్స్ కోరుకునే ఓ యువ ఆటగాడిని కూడా ట్రేడ్‌లో భాగం చేయాల్సి ఉంటుందని సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027కు ముందు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య జట్టు మారనున్నాడనే వార్తలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్‌ను ట్రేడ్ చేసుకునేందుకు పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రేసులో సీఎస్కే ముందున్నట్లు తెలుస్తోంది. శివమ్ దూబెతో హార్దిక్‌ను ట్రేడ్ చేయాలని సీఎస్కే యాజమాన్యం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా సీఎస్కే హార్దిక్‌ను దక్కించుకోవాలంటే ముంబై ఇండియన్స్ కోరుకునే ఓ యువ ఆటగాడిని కూడా ట్రేడ్‌లో భాగం చేయాల్సి ఉంటుందని సూచించాడు.
‘హార్దిక్ పాండ్య కోసం కేవలం శివమ్ దూబెను మాత్రమే ఇస్తామంటే ముంబై ఇండియన్స్ ఒప్పుకోదు. దూబెతో పాటు యువ ప్లేయర్ ఆయుశ్ మాత్రేను కూడా కోరుకుంటుంది. మాత్రే లేకుండా ఈ ట్రేడ్ డీల్‌కు ముంబై ముందుకు వస్తుందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ముంబై ఇండియన్స్ ఈ ప్రతిపాదనకు అంగీకరించకపోతే సీఎస్కే మరో మార్గాన్ని ప్రయత్నించొచ్చు. దూబెతో పాటు ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్‌ను కూడా ట్రేడ్‌లో చేర్చవచ్చు. బుమ్రాతో కలిసి డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. దీనికీ ముంబై ఒప్పుకోకపోతే దూబె, ఎల్లిస్‌తో పాటు ఉర్విల్ పటేల్‌ను కూడా ఆఫర్ చేయొచ్చు. అప్పుడు ముంబైకి వికెట్ కీపర్ బ్యాటర్ కూడా దక్కుతాడు’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
రెండు జట్లకూ ప్రయోజనం చేకూరేలా..
‘హార్దిక్ లాంటి కీలక ప్లేయర్‌ను వదులుకోవాలంటే ముంబై కూడా ఈ ట్రేడ్ ద్వారా తమకు ప్రయోజనం కలుగుతుందని భావించాలి. అందుకే ముంబై తిరస్కరించలేని విధంగా సీఎస్కే ప్రతిపాదన ఉండాలి. అంతేకాకుండా రెండు జట్ల మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడ్ కూడా జరగవచ్చు. సీఎస్కే నుంచి శివమ్ దూబె, నాథన్ ఎల్లిస్, ఉర్విల్ పటేల్‌తో పాటు మరో పేసర్‌ను ఇచ్చి.. ముంబై నుంచి హార్దిక్ పాండ్య, దీపక్ చాహర్‌లను తీసుకోవచ్చు. దీంతో సీఎస్కేకు హార్దిక్‌తో పాటు కొత్త బంతితో బౌలింగ్ చేసే దీపక్ చాహర్ కూడా అందుబాటులోకి వస్తాడు. మరోవైపు ముంబై జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలం పెరుగుతుంది’ అని అశ్విన్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య
పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!