Share News

పీఆర్ టీమ్‌తో ప్రచారాలు చేసుకోరు.. ఆ భారత ప్లేయర్లతో బవుమాను పోల్చిన గావస్కర్

ABN , Publish Date - Oct 26 , 2026 | 07:48 AM

దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ టెంబా బవుమాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మైదానంలో అతడి ప్రవర్తన, ఒత్తిడిలోనూ రాణించే తీరు అద్భుతమని కొనియాడాడు.

పీఆర్ టీమ్‌తో ప్రచారాలు చేసుకోరు.. ఆ భారత ప్లేయర్లతో బవుమాను పోల్చిన గావస్కర్
Sunil Gavaskar

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ టెంబా బవుమాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మైదానంలో అతడి ప్రవర్తన, ఒత్తిడిలోనూ రాణించే తీరు అద్భుతమని కొనియాడాడు. భారత మాజీ క్రికెటర్లు అజింక్య రహానె, గుండప్ప విశ్వనాథ్‌లతో బవుమాను పోల్చాడు. అతడు ఆటతోనే విమర్శకుల నోళ్లు మూయిస్తున్నాడని ప్రశంసించాడు. అంతేకాదు.. తన గొప్పతనాన్ని చాటుకోవడానికి ప్రచార బృందాలను పెట్టుకోని ఆటగాళ్లలో బవుమా ఒకడని వ్యాఖ్యానించాడు.


‘దక్షిణాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు బవుమా ఎంపికపై ఎన్నో విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. అయితే తన నాయకత్వంతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలతోనూ విమర్శకులకు అతడు సమాధానం ఇస్తూ వస్తున్నాడు. కెప్టెన్‌గా ఉండటం వేరు.. జట్టును ముందుండి నడిపించే నాయకుడిగా నిలవడం వేరు. బవుమా రెండింటిలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. బవుమా నాయకత్వంలో దక్షిణాఫ్రికా తొలి 14 టెస్టుల్లో 12 విజయాలు సాధించింది. భారత టెస్టు మాజీ కెప్టెన్ రహానె సారథ్యంలోనూ భారత్ ఒక్క టెస్టు సిరీస్‌నూ కోల్పోలేదు. ఇద్దరూ మైదానంలో ప్రదర్శనలతో తమను తాము నిరూపించుకున్నారు. తమ గురించి ప్రపంచానికి చెప్పుకోవడానికి భారీ ప్రచార బృందాలను ఏర్పాటు చేసుకునే రకం కాదు.


బవుమా మైదానంలో వ్యవహరించే తీరును చూస్తుంటే నాకు భారత మాజీ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్‌ను గుర్తొస్తున్నారు. ప్రత్యర్థులపై దూషణలకు దిగడం, ఆవేశంతో ఊగిపోవడం వంటివి చేయకుండానే గొప్ప క్రికెటర్‌గా ఎదగవచ్చని విశ్వనాథ్ నిరూపించారు. బవుమాలోనూ అలాంటి ప్రశాంతత, పోరాట పటిమ కనిపిస్తున్నాయి’ అని సునీల్ గావస్కర్ వెల్లడించాడు.


ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా110 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులో నిలిచిన బవుమా అద్భుతంగా పోరాడి 179 పరుగులు సాధించాడు. అతడి కీలక ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా కోలుకోవడమే కాకుండా, వర్షం ప్రభావం చూపిన ఆ టెస్టులో ఇన్నింగ్స్‌ 31 పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్‌ను సమం చేసింది.


ఇవి కూడా చదవండి:

రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు నో ప్లేస్.. రహానె ఆల్‌టైమ్ భారత టెస్టు జట్టు ఇదే!

వైభవ్‌ను వన్‌డౌన్‌లో ఆడించడం సరైన నిర్ణయం కాదు: అశ్విన్

Updated Date - Oct 26 , 2026 | 07:51 AM