హర్మన్, దీప్తి శతక్కొట్టారు
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:48 AM
భారత మహిళల జట్టు నుంచి మరో అద్భుత ప్రదర్శన. ఆదివారం జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకున్న భారత్ 121 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్...
121 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం
మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం
స్పిన్నర్ వైష్ణవికి నాలుగు వికెట్లు
జింబాబ్వేతో రెండో వన్డే
వడోదర: భారత మహిళల జట్టు నుంచి మరో అద్భుత ప్రదర్శన. ఆదివారం జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకున్న భారత్ 121 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (121 బంతుల్లో 15 ఫోర్లతో 126) సెంచరీతో ఫామ్‌ను చాటుకోగా.. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (86 బం తుల్లో 15 ఫోర్లతో 106 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అజేయ శతకం సాధించింది. అనంతరం కెరీర్లో రెండో వన్డే ఆడుతున్న స్పిన్నర్ వైష్ణవి శర్మ (4/39), దీప్తి శర్మ (3/32) అద్భుత బౌలింగ్‌తో కట్టడి చేశారు. దీంతో మరో మ్యాచ్ ఉండగానే భారత్ 2-0తో సిరీస్ దక్కించుకున్నట్టయ్యింది. బుధవారం ఆఖరి వన్డే జరుగుతుంది. ఇదివరకే మంధాన సేన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీ్‌ప చేసిన విషయం తెలిసిందే. ముందుగా భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 328 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ప్రతీకా రావల్ (67 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 61) రెండో మ్యాచ్‌లోనూ మెరిసింది. సిబండాకు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో జింబాబ్వే 48.5 ఓవర్లలో అతికష్టంగా 207 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ ముపచిక్వ (49), టిరిపానో (46), బిజా (34) మాత్రమే రాణించారు. తొలి 20 ఓవర్లలో 104/1 స్కోరుతో కాస్త మెరుగ్గానే కనిపించినా, ఆ తర్వాత 28.5 ఓవర్లలో 103 పరుగులే చేసి అన్ని వికెట్లను కోల్పోయింది. హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
శతక భాగస్వామ్యాలతో జోరు: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మంధాన (0), షఫాలీ (8) తొలి మూడు ఓవర్లలోనే పెవిలియన్‌కు చేరారు. అయితే మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసిన ప్రతీకా రావల్, మాజీ కెప్టెన్ హర్మన్ భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. హర్మన్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలేయడం కూడా కలిసివచ్చింది. అటు వెటరన్ దీప్తి శర్మ దూకుడుతో జింబాబ్వే బౌలర్లు పూర్తిగా గతి తప్పారు. హాఫ్ సెంచరీ సాధించిన ప్రతీకా 23వ ఓవర్లో వెనుదిరగ్గా, మూడో వికెట్‌కు హర్మన్‌తో కలిసి అందించిన 124 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తేజల్ (3) నిరాశపర్చగా.. ఆరో నెంబర్లో బరిలోకి దిగిన దీప్తి చెలరేగింది. స్వీప్ షాట్లతో ఆకట్టుకున్న తను 37 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసింది. అటు హర్మన్ చక్కటి కవర్ డ్రైవ్స్, కట్ షాట్లతో ఆధిపత్యం చూపి తన కెరీర్లో ఎనిమిదో శతకం అందుకుంది. చివరికి 47వ ఓవర్లో తను వెనుదిరగడంతో ఏడో వికెట్‌కు ఈ జోడీ మధ్య నెలకొన్న 153 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లతో దీప్తిశర్మ 83 బంతుల్లో రెండో సెంచరీని పూర్తి చేసింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 50 ఓవర్లలో 328/6 (హర్మన్‌ప్రీత్ 126, దీప్తి శర్మ 106 నాటౌట్, ప్రతీకా రావల్ 61; సిబండ 2/38).
జింబాబ్వే: 48.5 ఓవర్లలో 207 ఆలౌట్ (ముపచిక్వ 49, టిరిపానో 46, బిజా 34; వైష్ణవి 4/39, దీప్తి 3/32).
2
భారత మహిళల జట్టు తరఫున ఎక్కువ వన్డే శతకాలు (8) బాదిన రెండో బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్. మిథాలీ రాజ్ (7)ను అధిగమించగా.. మంధాన (14) టాప్‌లో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మీ-సేవలోడ్రైవింగ్ లైసెన్సు వీడియో!
Read Latest AP News And Telangana News And International News And Telugu News