రోజుకు గంట మీ కోసం కేటాయించుకోండి.. జెన్ జీకి ధోని సూచన
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:59 AM
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని యువతకు పలు కీలక సూచనలు చేశాడు. నేటి జీవనశైలిలో ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమకు మధ్య సమతుల్యత దెబ్బతింటోందని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని యువతకు పలు కీలక సూచనలు చేశాడు. నేటి జీవనశైలిలో ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమకు మధ్య సమతుల్యత దెబ్బతింటోందని అభిప్రాయపడ్డాడు. జెన్ జీ (Gen Z), జెన్ ఆల్ఫా (Gen Alpha) తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించాడు. రోజూ కనీసం గంటసేపు శారీరక దృఢత్వం కోసం కేటాయించాలని చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘గతంలో భారతీయుల ఆహారపు అలవాట్లలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండేవి. దాంతోపాటు రోజువారీ పనుల్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇంటి నుంచి బయటకు రాగానే ఆటో, క్యాబ్‌లలో ప్రయాణించడం.. ఆఫీసులకు వెళ్లి గంటల తరబడి కూర్చుని పనిచేయడం సాధారణమైంది. దీంతో శారీరక శ్రమ గణనీయంగా తగ్గిపోయింది. గతంలో ఉన్న ఆహారపు అలవాట్లనే ఇప్పటి తరం కొనసాగిస్తున్నా.. శరీరానికి అవసరమైన వ్యాయామం మాత్రం చేయడం లేదు. ఈ పరిస్థితిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. భారత్‌లో ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. చక్కెర అధికంగా ఉండే పదార్థాలు, నూనెలో వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే వారు సమాజంలో కొంతమందే ఉన్నారు. ప్రతిఒక్కరూ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమివ్వాలి’ అని ధోని అభిప్రాయపడ్డాడు.
ఆటలను ప్రోత్సహించాలి..
‘పాఠశాల స్థాయి నుంచే పిల్లలు వివిధ క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహించాలి. పిల్లల్లో ఏదైనా క్రీడలో ప్రతిభ ఉంటే దాన్ని గుర్తించి, మరింత మెరుగుపరుచుకునే అవకాశం కల్పించాలి. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఓటమిని స్వీకరించి మళ్లీ ప్రయత్నించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి. చిన్న వయసులోనే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకుంటే 30–35 ఏళ్ల వయసులో మెరుగైన ఆరోగ్యంతో జీవించేందుకు దోహదపడుతుంది. ప్రతి ఒక్కరికీ కుటుంబ బాధ్యతలు ఉంటాయి. తల్లిదండ్రులను చూసుకోవడం, తమ పిల్లల భవిష్యత్తు కోసం సంపాదించడం ముఖ్యమే. కానీ మన పిల్లలతో కలిసి ఆడాలన్నా, కుటుంబంతో చురుకుగా గడపాలన్నా శారీరకంగా దృఢంగా ఉండటం అవసరం’ అని ధోని వివరించాడు.
ఇవి కూడా చదవండి:
రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు నో ప్లేస్.. రహానె ఆల్‌టైమ్ భారత టెస్టు జట్టు ఇదే!
వైభవ్‌ను వన్‌డౌన్‌లో ఆడించడం సరైన నిర్ణయం కాదు: అశ్విన్