వైభవ్ సూర్యవంశీ ఫామ్‌లో ఉన్నా ఆడించలేం.. కారణం చెప్పిన గంభీర్
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:49 PM
వైభవ్ సూర్యవంశీకి జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు ఎవరు విజయాన్ని అందించగలరని కెప్టెన్, కోచ్ భావిస్తారో.. అదే ప్రాతిపదికగా తుది జట్టును ఎంపిక చేస్తామని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం సంజు శాంసన్, అభిషేక్ శర్మలతో కూడిన ఓపెనింగ్ జోడీ బాగా రాణిస్తుండటంతో అతడిని తుది జట్టులోకి తీసుకోవడం కష్టంగా మారిందని చెప్పాడు. జట్టుకు ఎవరు విజయాన్ని అందించగలరని కెప్టెన్, కోచ్ భావిస్తారో.. అదే ప్రాతిపదికగా తుది జట్టును ఎంపిక చేస్తామని పేర్కొన్నాడు.
‘వైభవ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇది నాకు కూడా కొత్త అనుభవమే. అయితే చాలాకాలంగా బాగా ఆడుతున్న ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పుడు.. అవకాశం కోసం కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుందని వైభవ్‌కు వివరించాను. సోషల్ మీడియా లేదా బయట జరుగుతున్న చర్చలు తుది జట్టును నిర్ణయించవు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఆటగాళ్లలో ఎవరు మ్యాచ్‌ను గెలిపించగలరు? ప్రస్తుతం అత్యుత్తమ కాంబినేషన్ ఏది? చాలాకాలంగా ఎవరు బాగా ఆడుతున్నారు? అనే అంశాలను బట్టి తుది జట్టును ఎంపిక చేస్తాం. ఈరోజు వైభవ్‌ను ఆడిస్తే.. జట్టు నుంచి తప్పించే ఆటగాడితో నేను కష్టమైన సంభాషణ చేయాల్సి ఉంటుంది. అది అభిషేక్ కావొచ్చు లేదా సంజు కావొచ్చు. రెండేళ్లుగా కొనసాగుతున్న కాంబినేషన్‌ను ఒక్కసారిగా పక్కన పెట్టలేం. మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమయ్యారని వారిని తప్పించి.. యువ ఆటగాడిని తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. వైభవ్‌కు తప్పకుండా అవకాశాలు వస్తాయి. అయితే సరైన సమయం కోసం అతడు వేచి ఉండాల్సిందే’ అని గంభీర్ స్పష్టం చేశాడు.
పాపులర్ నిర్ణయాలు తీసుకోలేను..
తన ఎంపికలపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, అభిమానుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో గంభీర్ స్పందించాడు. ‘నాకు పాపులర్ నిర్ణయాలు తీసుకోవడం చాలా సులభం. కానీ సరైన నిర్ణయం తీసుకోవడం మాత్రం చాలా కష్టం. ప్రస్తుతం సంజు, అభిషేక్‌ను కొనసాగించడం సరైన నిర్ణయమని మేము భావించాం. ప్రపంచ క్రీడా చరిత్రలో ఏ జట్టు కూడా ఒక ప్రపంచకప్ నుంచి మరో ప్రపంచకప్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా.. మళ్లీ ప్రపంచకప్ గెలవలేదు. మూడు మ్యాచ్‌ల్లో వైఫల్యం ఆటగాడిని చెడ్డ ఆటగాడిగా మార్చదు. అలాగే మన జట్టును కూడా చెడ్డ జట్టుగా మార్చదు’ అని గంభీర్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
బ్యాట్‌కు తగలకుండానే బౌండరీ దాటిన బంతి.. ఈ వైరల్ వీడియో చూశారా?
ఇది చాలా ప్రత్యేకం.. ఆసియాడ్ స్వర్ణ పతకంపై వీవీఎస్ లక్ష్మణ్ రియాక్షన్