టీమిండియా ఇప్పుడు షమీ వైపు చూడటంలో అర్థం లేదు: దినేశ్ కార్తీక్
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:04 PM
భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్.. షమీ రీఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. జాతీయ జట్టు షమీని దాటి ముందుకు వెళ్లిపోయిందని.. అతడు దేశవాళీ క్రికెట్‌లో ఎంత బాగా బౌలింగ్ చేసినా తిరిగి జట్టులోకి తీసుకోవడంలో అర్థం లేదని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకోవాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్.. షమీ రీఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. జాతీయ జట్టు షమీని దాటి ముందుకు వెళ్లిపోయిందని.. అతడు దేశవాళీ క్రికెట్‌లో ఎంత బాగా బౌలింగ్ చేసినా తిరిగి జట్టులోకి తీసుకోవడంలో అర్థం లేదని అభిప్రాయపడ్డాడు. 2025 తర్వాత షమీ గాయాల కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.
‘షమీ విషయంలో నేను మరోలా ఆలోచిస్తున్నా. భారత జట్టులో ప్రస్తుతం ఇతర పేసర్లు ఉన్నారు. టీమిండియా ఇప్పటికే షమీని దాటి ముందుకు వెళ్లిపోయింది. కాబట్టి మళ్లీ అతడి వైపు చూడటంలో అర్థం లేదు. అతడు దేశవాళీల్లో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ.. నేను షమీని జట్టులోకి తీసుకునే విషయాన్ని పరిశీలించను. టీమిండియాకు ఇప్పుడు షమీ అవసరం లేదు’ అని కార్తీక్ పేర్కొన్నాడు.
రో-కో కొనసాగాలి..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రం మరికొంతకాలం భారత జట్టులో కొనసాగాలని దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు వన్డేలకు వీడ్కోలు పలికితే.. ఆ ప్రభావం వన్డే క్రికెట్‌పై ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ‘అవును.. వారు ఇద్దరూ క్రికెట్‌లోనే అత్యంత గొప్ప ప్లేయర్లు. ప్రపంచ క్రికెట్‌కు భారత్ కేంద్ర బిందువుగా ఉంది. అలాంటి సమయంలో అత్యుత్తమ క్రికెటర్లలో ఇద్దరిని కోల్పోతే దాని ప్రభావం కచ్చితంగా ఉంటుంది’ అని కార్తీక్ చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
బ్యాట్‌కు తగలకుండానే బౌండరీ దాటిన బంతి.. ఈ వైరల్ వీడియో చూశారా?
ఇది చాలా ప్రత్యేకం.. ఆసియాడ్ స్వర్ణ పతకంపై వీవీఎస్ లక్ష్మణ్ రియాక్షన్