40 ఎకరాల బీడు భూమి నుంచి అత్యాధునిక సీఓఈ వరకు.. జై షా విజన్ ఇదే!
ABN , Publish Date - Aug 10 , 2026 | 05:28 PM
ఒకప్పుడు ఖాళీగా ఉన్న 40 ఎకరాల భూమి.. ఇప్పుడు ప్రపంచ స్థాయి క్రికెట్ మౌలిక సదుపాయాలకు చిరునామాగా మారింది. బీసీసీఐ ఆధ్వర్యంలో బెంగళూరులో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) వెనుక బీసీసీఐ మాజీ కార్యదర్శి, ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ జై షా పాత్ర అత్యంత కీలకం.
ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు ఖాళీగా ఉన్న 40 ఎకరాల భూమి.. ఇప్పుడు ప్రపంచ స్థాయి క్రికెట్ మౌలిక సదుపాయాలకు చిరునామాగా మారింది. బీసీసీఐ ఆధ్వర్యంలో బెంగళూరులో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) వెనుక బీసీసీఐ మాజీ కార్యదర్శి, ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ జై షా పాత్ర అత్యంత కీలకం. కొంతకాలంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్ గురించి సీఓఈ తరుచూ వార్తల్లో నిలుస్తూన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సీఓఈను బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా, బోర్డు అధికారులు సందర్శించారు. సీఓఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే 40 ఎకరాల బీడు భూమి నుంచి అత్యాధునిక సదుపాయాలతో కూడిన ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా రూపుదిద్దుకున్న తీరును దేవజిత్ సైకియా వివరించారు.
అందరినీ ఒప్పించి.. వేగంగా పనులు
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లోని సభ్యులందరినీ జై షా ఒప్పించారని సైకియా తెలిపారు. అప్పటివరకు ఉన్న తాత్కాలిక నేషనల్ క్రికెట్ అకాడమీ వ్యవస్థకు స్వస్తి పలికి.. ఆధునిక సదుపాయాలతో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ‘పనులు ప్రారంభించేందుకు ముందు ఎన్నో న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యాయి. జై షా స్వయంగా పలుమార్లు ఇక్కడికి వచ్చి ఆ అడ్డంకులను పరిష్కరించారు. భూమిని క్రమబద్ధీకరించాల్సి వచ్చింది. 40 ఎకరాల భూమి ఖాళీగా ఉండటంతో దాన్ని తిరిగి తీసుకోవాలని చాలామంది ప్రయత్నించారు. అప్పుడు జై షా కృషి మరువలేనిది. చివరకు అన్ని సమస్యలను పరిష్కరించిన తర్వాత 2022 ఫిబ్రవరి 14న పనులు ప్రారంభించాం’ అని సైకియా తెలిపారు.
రెండేళ్లలోనే భారీ మౌలిక సదుపాయాలు..
నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు మారే ప్రక్రియలో భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా కీలక పాత్ర పోషించారు. రాహుల్ ద్రవిడ్ భారత జట్టు ప్రధాన కోచ్‌గా వెళ్లిన తర్వాత.. అకాడమీ కార్యకలాపాల్లో కొనసాగింపు ఉండేలా జై షా, అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తనను సంప్రదించారని లక్ష్మణ్ గతంలో వెల్లడించాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణంలో జై షా ప్రత్యక్షంగా చూపిన ఆసక్తిని కూడా లక్ష్మణ్ గుర్తుచేసుకున్నాడు. ఆర్కిటెక్ట్‌లు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో జరిగిన సమావేశాలకు హాజరవుతూ.. ప్రతి అంశాన్ని పర్యవేక్షించేవారని చెప్పాడు. ‘దాదాపు రెండేళ్ల వ్యవధిలోనే మొత్తం మౌలిక సదుపాయాలు సిద్ధమయ్యాయి. జై షా చూపించిన ఆసక్తి, పట్టుదల ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. 2022 ఫిబ్రవరి 14న ఈ నిర్మాణ పనులు ప్రారంభించగా.. 2024 నవంబర్‌లో సీఓఈ కార్యకలాపాలు మొదలైన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఫిట్‌నెస్ కోసం 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్ ఈసారైనా నిరూపించుకుంటాడా?
2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్