Share News

ఫిట్‌నెస్‌ కోసం 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌ ఈసారైనా నిరూపించుకుంటాడా?

ABN , Publish Date - Aug 10 , 2026 | 04:24 PM

భారత టెస్టు జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. అయితే జట్టులో స్థానం కోల్పోయిన అతడు.. రీఎంట్రీ ఇవ్వడం వెనుక ఎంతో కఠోర శ్రమనే ఉంది. ఏడాదిన్నరగా కశ్మీర్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ.. ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడు.

ఫిట్‌నెస్‌ కోసం 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌ ఈసారైనా నిరూపించుకుంటాడా?
Sarfaraz Khan

ఇంటర్నెట్ డెస్క్: భారత టెస్టు జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని ఎంపిక చేసింది. స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం దక్కింది. అయితే జట్టులో స్థానం కోల్పోయిన అతడు.. రీఎంట్రీ ఇవ్వడం వెనుక ఎంతో కఠోర శ్రమనే ఉంది. ఏడాదిన్నరగా కశ్మీర్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ.. ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడు. అనూహ్యంగా జట్టులో చోటు సంపాదించుకున్న సర్ఫరాజ్.. ఈసారైనా నిరూపించుకుంటాడా? అనేది చూడాల్సి ఉంది.


కశ్మీర్‌లో గంటల తరబడి సాధన

ముంబైలో వర్షాల కారణంగా సరిగ్గా సాధన చేసే అవకాశం లేకపోవడంతో సర్ఫరాజ్‌ కశ్మీర్‌కు వెళ్లాడు. అక్కడ నెట్‌ బౌలర్లు, రాష్ట్ర జట్టు ఆటగాళ్లతో కలిసి గంటల తరబడి బ్యాటింగ్‌ సాధన చేశాడు. అంతేకాకుండా ముంబైలోని ఎంసీఏ ఇండోర్‌ సదుపాయంలో ఆస్ట్రోటర్ఫ్‌పై స్కిల్స్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాడు. కుర్లాలోని ఎర్ర మట్టి పిచ్‌లపై స్పిన్‌ను ఎదుర్కొంటూ ప్రత్యేకంగా సాధన చేశాడు. ఐపీఎల్‌ తర్వాత ముంబై టీ20 లీగ్‌లోనూ సర్ఫరాజ్‌ ఆకట్టుకునే ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో తన ఆటను మెరుగుపరుచుకోవడంతో పాటు.. స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా సిద్ధమయ్యాడు.


స్పిన్‌ ఆడటంలో దిట్ట..!

సాయి సుదర్శన్‌ గాయం ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో సెలక్టర్ల ముందు సర్ఫరాజ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, షేక్‌ రషీద్‌ పేర్లు ఉన్నాయి. వీరిలో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో సర్ఫరాజ్‌ సరైన ఎంపికగా భావించారు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌ తర్వాత ప్రస్తుత భారత జట్టులో స్పిన్‌ను అత్యుత్తమంగా ఆడగల బ్యాటర్లలో సర్ఫరాజ్‌ ఒకడని జట్టు వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ధ్రువ్‌ జురెల్‌ స్పిన్‌ను ఎదుర్కొనే విషయంలో ఇబ్బందులు పడుతున్నాడు. సర్ఫరాజ్‌కు స్వీప్‌తో పాటు రివర్స్‌ స్వీప్‌ ఆడే సామర్థ్యం ఉండటంతో శ్రీలంక స్పిన్‌ పిచ్‌లపై అతడు కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం తిరిగి జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్‌.. శ్రీలంక స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య తదితరులను ఎదుర్కొని తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

నకిలీ లింక్‌లతో జాగ్రత్త.. చందాదారులకు ఈపీఎఫ్ఓ సూచన

Updated Date - Aug 10 , 2026 | 04:24 PM