Share News

అలెన్ క్యాచ్ వివాదం.. మా ఓటమికి అదే కారణం కాదు: కేకేఆర్ ప్లేయర్ పావెల్

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:11 PM

కేకేఆర్ ఓపెనర్ ఫిల్ అలెన్ ఔటైన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ క్యాచ్ తీసుకునేటప్పుడు దిగ్వేశ్ బౌండరీ లైన్‌ను తాకినట్లు కేకేఆర్ అభిమానులు ఆరోపించారు. ఫీల్డ్ అంపైరే నిర్ణయం తీసుకోవడంపైనా విమర్శలు వచ్చాయి. వీటిపై కేకేఆర్ ప్లేయర్ రోవ్‌మన్ పావెల్ మాట్లాడాడు.

అలెన్ క్యాచ్ వివాదం.. మా ఓటమికి అదే కారణం కాదు: కేకేఆర్ ప్లేయర్ పావెల్
Rovman Powell

ఇంటర్నెట్ డెస్క్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆఖరి బంతి వరకు పోరాడి 3 వికెట్ల తేడాతో లఖ్‌నవూ గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ ఫిల్ అలెన్ ఔటైన తీరు వివాదాస్పదమైంది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో బౌండరీ లైన్ వద్ద దిగ్వేశ్ సింగ్ క్యాచ్ పట్టాడు. అది బౌండరీ లైన్‌ను తాకినట్లు కేకేఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఫీల్డ్ అంపైరే నిర్ణయం తీసుకోవడంపైనా విమర్శలు వచ్చాయి. వీటిపై కేకేఆర్ ప్లేయర్ రోవ్‌మన్ పావెల్ మాట్లాడాడు.


‘ఫిన్ అలెన్ క్యాచ్ విషయంలో అంపైర్లు నిశితంగా పరిశీలించాల్సింది. అలెన్ ఔటై డగౌట్‌కు వచ్చాక మేం ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. ఐపీఎల్‌లోని ఫీల్డ్ అంపైర్లు ప్రతి చిన్న విషయానికీ థర్డ్ అంపైర్‌కు సిఫార్సు చేస్తుంటారు. కానీ ఈ విషయంలో మాత్రం పట్టించుకోలేదు. ఇది కచ్చితంగా అంపైర్ల నుంచి జరిగిన పొరపాటే. అయితే మేం ఈ మ్యాచ్‌లో ఓడిపోవడానికి కారణమదే అని మాత్రం చెప్పబోం. హోం గ్రౌండ్‌లో రెండు పాయింట్లను కోల్పోవడం నిరుత్సాహానికి గురిచేసింది. భారీగా ప్రేక్షకులు మద్దతుగా నిలిచిన ఈ మైదానంలో గెలిచి ఉంటే.. ఆ అనుభూతే వేరుగా ఉండేది. కానీ అలా జరగలేదు. మేం 181 పరుగుల స్కోర్ చేసినప్పుడు తప్పకుండా విజయం సాధిస్తామనే భావించాం. కానీ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ యువ ప్లేయర్ ముకుల్ చౌదరి మా నుంచి గెలుపును లాగేసుకున్నాడు. ఈ విజయం క్రెడిట్ అతడికే దక్కాలి’ అని పావెల్ వివరించాడు.


శ్రమిస్తాం..

‘తొలి విజయాన్ని నమోదు చేయబోతున్నామనే ఆనందంతో ఉండిపోయాం. కానీ ఈ మ్యాచ్‌లో మాకు కాస్త అదృష్టం కలిసి రాలేదు. మా డెస్టినీ మా చేతుల్లోనే ఉంది. మాకు ఇంకా చాలా మ్యాచ్‌లు ముందున్నాయి. ఒక్కసారి విజయాల బాట పడితే చాలు. ఇప్పుడు లఖ్‌నవూతోనూ మంచి గేమ్ ఆడాం. కానీ గెలవలేకపోయాం. ఇంకా మెరుగ్గా శ్రమించి ఆడతాం. ఆఖరి ఓవర్లో బంతిని కాస్త దూరంగా వేయాలని ప్లాన్ చేసుకున్నాం. ముకుల్ షార్ట్ పిచ్ బంతులనూ బాగా ఆడాడు. దీంతో వైడ్ యార్కర్లను ట్రై చేస్తే ఫలితం వస్తుందని భావించాం. కానీ ముకుల్ మాకు అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు’ అని పావెల్ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ

ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య

Updated Date - Apr 10 , 2026 | 03:12 PM