విధ్వంసకర విన్యాసాల వీరుడు.. అసలెవరీ ముకుల్ చౌదరి!
ABN , Publish Date - Apr 10 , 2026 | 02:37 PM
ఐపీఎల్.. ప్రతి ఏడాది సరికొత్త ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే ఓ అద్భుతమైన ప్లాట్‌ఫారమ్. ఎంతోమంది యువ ప్లేయర్లను వెలుగులోకి తెచ్చిన ఘనత ఈ లీగ్‌ది! దీనికి సరికొత్త ఉదాహరణ.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కుర్రాడు ముకుల్ చౌదరి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్.. ప్రతి ఏడాది సరికొత్త ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే ఓ అద్భుతమైన ప్లాట్‌ఫారమ్. ఎంతోమంది యువ ప్లేయర్లను వెలుగులోకి తెచ్చిన ఘనత ఈ లీగ్‌ది! దీనికి సరికొత్త ఉదాహరణ.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కుర్రాడు ముకుల్ చౌదరి. 27 బంతుల్లోనే 54 పరుగులు నాటౌట్.. ఇందులో ఏకంగా 7 సిక్సర్లు! కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపు ఖాయమని అనుకుంటున్న సమయంలో ఎల్ఎస్‌జీకి హీరోగా వచ్చాడు ముకుల్. పరుగుల దాహంలో విరాట్ కోహ్లీ.. ఫినిషర్‌లో ధోనిని తలపించేలా అద్భుతమైన షాట్లతో విరుచుకుపడుతూ.. కేకేఆర్ నుంచి గెలుపును సరదాగా లాగేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. మరి ఇంతకీ ఎవరీ ముకుల్ చౌదరి..!!

ఈ 22 ఏళ్ల ముకుల్ చౌదరి స్వస్థలం రాజస్థాన్. తన కొడుకు క్రికెటర్ అవ్వాలని ముకుల్ తండ్రి ఎన్నో కలలు కనేవాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్నతనం నుంచే ఆ దిశగా నడవలేకపోయాడు. ఎలాగైనా తన కుమారుడిని క్రికెటర్‌ని చేయాలనే పట్టుదలతో ముకుల్ తండ్రి.. తమ ఇంటినే అమ్మేసి ఎస్‌బీఎస్ అకాడమీలో చేర్పించాడు. అప్పటికి ముకుల్ వయసు 12 ఏళ్లు. అక్కడే దాదాపు ఐదేళ్లు శిక్షణ తీసుకున్నాడు. అక్కడ నుంచి జైపుర్ వెళ్లి నాలుగేళ్లపాటు ప్రాక్టీస్ చేశాడు. ఓసారి అండర్ 19 మ్యాచులో యూపీపై తన ఆటను చూసిన తర్వాత ముకుల్ తండ్రికి భరోసా వచ్చిందట. 2026 ఐపీఎల్ మినీ వేలంలో ముకుల్ బేస్ ప్రైజ్ రూ.30 లక్షలు. అతడిని లఖ్‌నవూ ఫ్రాంచైజీ ఏకంగా రూ.2.60కోట్లకు కొనుగోలు చేసింది.
ధోనినే నా రోల్‌మోడల్..
ఐపీఎల్‌లో ఇంత మంది ప్లేయర్లు ఉన్నప్పటికీ ఫినిషర్ అంటే ముందుగా ధోనినే గుర్తొస్తాడు. అయితే ఫినిషర్‌గా మ్యాచ్‌ను గెలిపించాలంటే తీవ్ర ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటి పాత్రలో వచ్చిన ముకుల్.. అద్భుతం చేసి చూపించాడు. 182 పరుగుల లక్ష్య ఛేదనలో 8వ వికెట్‌కు అవేశ్ ఖాన్‌తో కలిసి 24 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అందులో ముకుల్ 21 బంతుల్లో 52 పరుగులు బాదేశాడు. అయితే ముకుల్ చౌదరికి ధోని అంటే చాలా ఇష్టమట. ధోనినే రోల్ మోడల్‌గా తీసుకుని క్రికెట్ అరంగేట్రం చేశాడట. అయితే ముకుల్ కూడా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కావడం కొసమెరుపు. ఈ మ్యాచ్‌లోనూ ధోనిలా ‘హెలికాప్టర్ షాట్’తో సిక్స్ బాదడం.. చివరి ఓవర్లో ఏకంగా రెండు సిక్సర్లు బాది జట్టును గెలిపించి సంచలనంగా మారాడు.
మా అదృష్టం: కోచ్ లాంగర్
ముకుల్ చౌదరి విధ్వంసంపై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు. ‘డేటా అనలిస్ట్ శ్రీనివాస్ సూచనలతోనే ముకుల్ చౌదరిని జట్టులోకి తీసుకున్నాం. ఈ కుర్రాడిలో ఉన్న ప్రతిభను ముందుగానే గుర్తించాం. అతడిని తీసుకోవడం మా అదృష్టం. ముకుల్ వికెట్ల మధ్య పరుగెడుతుంటే విరాట్ కోహ్లీనే గుర్తొచ్చాడు. కోహ్లీలానే ముకుల్ కూడా మంచి రన్నర్. ఇలాంటి విజయాలు జట్టుకు కొత్త నమ్మకం ఇస్తాయి. చిన్న వయసులోనే ఇంత పెద్ద బాధ్యత తీసుకుని గెలిపించడం గొప్ప విషయం’ అని అన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య